45 ఏళ్ళ నవలా చిత్రం 'సెక్రటరీ'

45 ఏళ్ళ నవలా చిత్రం 'సెక్రటరీ'

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నవలానాయకునిగా  జేజేలు అందుకున్నారు. తెలుగు చిత్రసీమలో ఏయన్నార్ కు నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలు భలేగా అచ్చివచ్చాయి. 1974లో ఏయన్నార్ అనారోగ్యం పాలయ్యారు. ఆయన హృదయానికి శస్త్ర చికిత్స జరిగింది.  విశ్రాంతి తీసుకున్నారు. అందువల్ల 1975లో ఏయన్నార్ నటించిన ఏ చిత్రమూ విడుదల కాలేదు. మళ్ళీ ఆయన ముఖానికి రంగేసుకొని కెమెరా ముందు నటించిన చిత్రంగా 'సెక్రటరీ' తెరకెక్కింది. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రాసిన 'సెక్రటరీ' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.  కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో సురేశ్ మూవీస్ పతాకంపై డి.రామానాయుడు 'సెక్రటరీ'ని నిర్మించారు. 1976 ఏప్రిల్ 28న విడుదలైన ఈ నవలా చిత్రం అక్కినేని అభిమానులను ఎంతగానో అలరించింది. 

అచ్చి వచ్చిన వాణిశ్రీ!

అంతకు ముందు యద్దనపూడి రచనలతో రూపొందిన "ఆత్మీయులు, విచిత్రబంధం" వంటి నవలా చిత్రాలతో విజయాలను చవిచూశారు ఏయన్నార్. ఆ చిత్రాలలో నాయికగా నటించిన వాణిశ్రీనే 'సెక్రటరీ'లోనూ హీరోయిన్ గా ఎంచుకున్నారు. అలాగే సురేశ్ సంస్థ అంతకు ముందు ఏయన్నార్, వాణిశ్రీతోనే నిర్మించిన నవలా చిత్రం 'ప్రేమనగర్' సూపర్ హిట్ గా నిలచింది. ఆ కోణంలోనూ వాణిశ్రీనే ఈ చిత్రంలోని నాయిక పాత్రకు న్యాయం చేయగలదని భావించారు. 'సెక్రటరీ' నవలగా రాకముందు  ఓ ప్రముఖ వారపత్రికలో సీరియల్ గా ప్రచురితమైంది. అందులోని కథానాయకుడు రాజశేఖరం, కథానాయిక జయంతి పాత్రలు పాఠకులను ఎంతగానో అలరించాయి. దాంతో తెరపై ఆ రెండు పాత్రలు ఏ తీరున రూపుదిద్దుకున్నాయో చూడాలని జనం అభిలషించారు. అదీగాక ఓ యేడాది గ్యాప్ తరువాత ఏయన్నార్ నటించిన చిత్రంగా 'సెక్రటరీ' రావడంతో అభిమానులు థియేటర్లకు పరుగులు తీశారు. మొత్తానికి 'సెక్రటరీ' ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొందనే చెప్పాలి. 

అలరించిన పాటలు...

'సెక్రటరీ' చిత్రంలో ఏయన్నార్, వాణిశ్రీతో పాటు చంద్రమోహన్, జయసుధ, కాంచన, గుమ్మడి, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య, రాజబాబు, సత్యనారాయణ, రంగనాథ్, ధూళిపాల, కృష్ణకుమారి, రమాప్రభ, శాంతకుమారి, హేమలత, గిరిజ తదితరులు నటించారు. ఈ చిత్రానికి పాటలు, మాటలు ఆచార్య ఆత్రేయ రాశారు. ఇందులోని మొత్తం ఏడు పాటల్లో- "ఆకాశమంత పందిరి వేసి...", "నా పక్కన చోటున్నది ఒక్కరికే..", "మొరటోడు నా మొగుడు...", "చాటు మాటు సరసంలో ఘాటు ఉన్నది..", "మనసులేని బతుకొక నరకం..." వంటి పాటలు అలరించాయి.

మరి కొన్ని...

ఏయన్నార్ సొంత స్టూడియో అన్నపూర్ణలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రంగా 'సెక్రటరీ' నిలచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కె.ఎస్. ప్రకాశరావు టేకింగ్ చూస్తే, ఆయన తనయుడు కె.రాఘవేంద్రరావు తన చిత్రాల్లోనూ అదే తరహా కెమెరా యాంగిల్స్ అనుసరించినట్టు ఇట్టే తెలిసిపోతుంది. మరో విచిత్రమేంటంటే,  1976 ఏప్రిల్ 28న 'సెక్రటరీ' సినిమా విడుదల కాగా,  కె.ఎస్.ప్రకాశరావు తనయుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'అడవిరాముడు' ఆ మరుసటి సంవత్సరం అంటే 1977లో అదే తేదీన విడుదలై విజయఢంకా మోగించింది. అలా తండ్రీకొడుకులకు ఏప్రిల్ 28వ తేదీ కలిసొచ్చిందని చెప్పాలి. 

అప్పట్లో ఓ ప్రజాసంక్షేమ పథకం కోసం నిధుల సేకరణ నిమిత్తమై ఉత్తరాది సినిమా తారలు, దక్షిణాది నటీనటులు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఉత్తరాది జట్టుకు దిలీప్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించగా, దక్షిణాది టీమ్ కు యన్టీఆర్ నాయకత్వం వహించారు. లాల్ బహదూర్ స్టేడియమ్ లో జరిగిన ఆ బెనిఫిట్ మ్యాచ్ ను ఓ లఘు చిత్రంగా రూపొందించారు. ఆ మ్యాచ్ ప్రదర్శన హక్కులు అప్పట్లో డి.రామానాయుడు మంచి రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారు. 'సెక్రటరీ' ప్రదర్శితమవుతున్న థియేటర్లలో ఆ క్రికెట్ మ్యాచ్ ను ఇంటర్వెల్ సమయంలో ప్రదర్శించేవారు. దాంతో ఇతర అభిమానులు సైతం ఆ లఘు చిత్రం చూడటం కోసం 'సెక్రటరీ' ఆడుతున్న థియేటర్లకు వెళ్ళారు.

(ఏప్రిల్ 28న 'సెక్రటరీ' 40 ఏళ్ళు పూర్తి)