30 ఏళ్ళ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' 

30 ఏళ్ళ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' 

సంఘసంస్కర్తగా, సర్వమానవులు ఒకటే అన్న సత్యాన్ని చాటిన ఘనుడిగా, లోకానికి గాయత్రి మంత్రాన్ని ప్రసాదించిన స్రష్టగా, జంబూద్వీపానికి భరతఖండం అని నామకరణం చేసిన ధీశాలిగా బ్రహ్మర్షి  విశ్వామిత్రుడు నిలిచారు. ఆయన కథ స్ఫూర్తితోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న యన్.టి.రామారావు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశ్వామిత్ర పాత్రతో పాటు  రావణబ్రహ్మగానూ ఆయన అభినయించారు. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించారు. యన్.టి.ఆర్. ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రం ద్వారా  వచ్చే ఆదాయం తన ధర్మపత్ని శ్రీమతి బసవరామ తారకం మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ నిర్వహించే 'మాతాశిశు ఆరోగ్య కేంద్రాని'కే అర్పితం... సమర్పితం అని ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లోనే ప్రకటించారు  రామారావు. 1991 ఏప్రిల్ 19న 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రం విడుదలయింది.

వ్యాకరణం చెప్పింది...

విశ్వామిత్రుడు రాజర్షి. నిజానికి 'విశ్వామిత్రుడు' అంటే 'విశ్వానికి మిత్రుడు' అన్నదే అర్థం. కానీ, 'విశ్వ' అన్న పదం అకారాంతం. దానికి 'మిత్ర' అన్న పదం చేరినా, 'విశ్వ' చివరి అక్షరం దీర్ఘం కాజాలదు. కావున 'విశ్వామిత్ర' అంటే 'విశ్వానికి అమిత్రుడు'అనే అర్థం స్ఫురిస్తుంది. విశ్వామిత్రుడు తన తపశ్శక్తిని పలుమార్లు వృథా చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. త్రిశంకుని కోసం సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి తపోఫలాన్ని దారపోశాడు. ఆ సమయంలోనే కారం అనే రుచిని సృష్టించాడని, దానివల్ల జనానికి కీడే జరిగిందని కొందరి అభిప్రాయం. అందువల్ల ఆయన విశ్వానికి అమిత్రుడే అని వారి వాదన. ఏది ఏమైనా విశ్వామిత్రునిగా మారిన కౌశికుడు చివరకు బ్రహ్మర్షి అయ్యాడు. 

ఆంధ్రులకు తండ్రి... భారతీయులకు తాత...

కౌశికుని తనయుల్లో ఆంధ్రుడు ఒకరు. ఆయన సంతతివారే ఆంధ్రులు అని ప్రతీతి. అందువల్ల ఆంధ్రులకు విశ్వామిత్రుడు తండ్రి. ఇక ఆయనకు, మేనకకు జన్మించిన శకుంతల తనయుడు భరతుని నామధేయం మీదే మన జంబూద్వీపానికి 'భారతదేశం' అన్న పేరు వచ్చింది. అలా భారతీయులకు విశ్వామిత్రుడు తాత అవుతాడు. ఇలాంటి విషయాలను 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రంలో చొప్పించారు. ఇక ఇందులో విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని వేధించిన కథ, సీతారాముల కళ్యాణం జరిపించిన వైనం, మేనక వలన తపోభంగం చెందడం, దుష్యంతుడు, శకుంతల గాథ కనిపిస్తాయి. చివరలో విశ్వామిత్రునికి బ్రహ్మపథం లభించి, బ్రహ్మర్షిగా మారి, సప్త ఋషులలో ఒకరిగా వెలగడంతో కథ ముగుస్తుంది. 

మేటి తారల కలయిక...

బ్రహ్మర్షి విశ్వామిత్రగా యన్టీఆర్ నటించిన ఈ చిత్రంలో బాలకృష్ణ హరిశ్చంద్ర, దుష్యంత పాత్రలు ధరించారు. మేనకగా మీనాక్షి శేషాద్రి, చంద్రమతిగా దీపిక, శకుంతలగా మధుమిత నటించారు. అంజాద్ ఖాన్ వీరబాహుగా, గుమ్మడి వశిష్ఠునిగా అభినయించారు. సుత్తివేలు, మిక్కిలినేని, రత్నబాబు, అశోక్ కుమార్, గణేశ్- కుమరేశ్ ఇతర పాత్రల్లో కనిపించారు. కుయిలి, డిస్కోశాంతి ఇందులో విశ్వామిత్రుడు సృష్టించిన మాతంగ కన్యలుగా నటించారు. 

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, కూర్పు, దర్శకత్వం యన్టీఆర్ నిర్వహించారు. ఈ సినిమాకు నాగభైరవ కోటేశ్వరరావు రచన చేయగా, పాటలను సి.నారాయణరెడ్డి రాశారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు రవీంద్ర జైన్ స్వరకల్పన చేశారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో నిర్మించారు. అందువల్ల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాసు, రామకృష్ణ, రవీంద్రజైన్, లతా మంగేష్కర్, పి.సుశీల, ఆశా భోస్లే, హేమలత, కవితాకృష్ణమూర్తి, అనురాధా పాడ్వాల్, వాణీ జయరామ్ వంటి  ఉత్తర దక్షిణాలకు చెందిన మేటి గాయనీగాయకులు ఇందులో పాటలు పాడారు. మోహన్ కృష్ణ ఛాయాగ్రహణం నిర్వహించారు.

అలరించిన పాటలు...

మేనక పాత్రధారి మీనాక్షి శేషాద్రిపై చిత్రీకరించిన 'ఎందరో బులిపించినా...' పాట మంచి ఆదరణ పొందింది. శకుంతల, దుష్యంతులపై తెరకెక్కించిన "ప్రియా చెలియా..." పాట ఏసుదాస్, సుశీల గాత్రాల్లో అమృతం కురిపించింది. "ఈ చిన్నది ముద్దుల చింతామణి..." అంటూ సాగే పాటను మాతంగ కన్యలపై రూపొందించారు. ఏసుదాస్ గళంలో జాలువారిన అనేక శ్లోకాలు ఎంతగానో అలరించాయి. 

నభూతో నభవిష్యత్... 

ఈ సినిమా షూటింగ్ 1989 జూన్ 19న అంగరంగ వైభవంగా ఆరంభమైంది. నభూతో నభవిష్యత్ అన్న చందాన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' మొదలైంది. నాచారంలోని రామకృష్ణ హార్టీ కల్చరల్ స్టూడియోస్ లో తొలి 
సన్నివేశాన్ని, యన్టీఆర్, మీనాక్షి శేషాద్రిపై చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ సమయానికి యన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పైగా ఆయన అప్పట్లో 'నేషనల్ ఫ్రంట్' పెట్టి, దానికి అధ్యక్షులుగా 
వ్యవహరించారు. దాంతో ఆయన ఆహ్వానం మేరకు నాటి మేటి రాజకీయ నాయకులు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్,  ఏబీ వాజ్ పేయ్, ఎల్.కె.అద్వానీ, దేవీలాల్  వంటి కాకలు తీరిన రాజకీయప్రముఖులు  హాజరయ్యారు. ఇక తెలుగు చిత్రసీమకు చెందినవారే కాకుండా, ఎందరో పరభాషా సినీప్రముఖులు సైతం ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విశ్వామిత్రుని గెటప్ లో ఉన్న యన్టీఆర్ కు కమల్ హాసన్  వంగి వందనం చేయడం అప్పట్లో విశేషంగా తమిళులు సైతం ముచ్చటించుకున్నారు. ఈ సినిమా హిందీ వర్షన్ కోసం యన్టీఆర్ ముంబయ్ వెళ్ళి రికార్డు చేయించారు. అక్కడ ధర్మేంద్ర వంటి సినీప్రముఖులు  వచ్చి, రామారావును కలుసుకొని అభినందించారు. 

రాజకీయ దుమారం.... పోటీ చిత్రాలు... 

1989లో రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'కు శ్రీకారం చుట్టారు. ఓ ముఖ్యమంత్రి ఫీచర్ ఫిలిమ్ లో నటించడం అన్నది మన దేశంలో అదే మొదటి సారి, చివరి సారి కావడం 
గమనార్హం! అప్పట్లో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. ఏమి చేసైనా రామారావును ఓడించాలన్నది రాజీవ్ లక్ష్యం. ఎలాగైనా రాజీవ్ ను గద్దె దించాలన్నది యన్టీఆర్ సంకల్పం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం 
పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ పలు సన్నాహాలు చేసింది. అంతకు ముందు 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో యన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించిన 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర 
స్వామి చరిత్ర'ను నవంబర్ 29న విడుదల చేశారు. ఆ చిత్రం సాధించిన అఖండ విజయం, అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయానికి కూడా దోహదపడింది. టీడీపీ 33 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ 
చేయగా, 30 సీట్లను కైవసం చేసుకుంది. అదీగాక, అప్పట్లో దేశం మొత్తం మీద కాంగ్రెస్ తరువాత డబుల్ డిజిట్ చూసిన ఏకైక పార్టీగానూ నిలచింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం సాగిన రోజుల్లో ప్రాంతీయ పార్టీ 
అయిన తెలుగుదేశమే ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో యన్టీఆర్ తెరకెక్కిస్తున్న 'విశ్వామిత్ర'ను కూడా 1989లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో విడుదల చేస్తారేమోనని కాంగ్రెస్ పార్టీ కంగారు 
పడింది. దీంతో తమ పార్టీకి సానుభూతి చూపించే దాసరి నారాయణరావుతో 'విశ్వామిత్ర' సీరియల్ ను రూపొందించింది. ఇందులో మేనకగా భానుప్రియ నటించారు. అదే సమయంలో 'కలియుగ విశ్వామిత్ర' 
అంటూ విజయ్ చందర్ లాంటివాళ్ళు మరో సినిమా నిర్మించారు.  ఆ చిత్రాలు ఎన్నికల సమయానికి వెలుగు చూశాయి. అయితే యన్టీఆర్ 1989 సార్వత్రిక ఎన్నికల వేళకు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'ను సిద్ధం 
చేయలేకపోయారు. 1989 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయింది. అటు కేంద్రంలో రాజీవ్ గాంధీ కూడా పదవీచ్యుతుడయ్యారు. అలా రామారావు, రాజీవ్ గాంధీ ఒకరినొకరు 
ఓడించుకోగలిగారు. 

ఎన్నికల్లో... 

రామారావు ఎన్నికలు కాగానే, పార్టీ జయాపజయాలతో నిమిత్తం లేకుండా, మళ్ళీ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' షూటింగులోకి దిగారు. 1990 సంవత్సరానికి ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. అయితే తరువాత యన్టీఆర్ 
నెలకొల్పిన నేషనల్ ఫ్రంట్ తరపున ప్రధాని అయిన వీపీ సింగ్ పదవి కోల్పోవడం, తరువాత చంద్రశేఖర్ ప్రధాని కావడం జరిగాయి. తరువాత పార్లమెంట్ లో ఎవరికీ సరైన బలం లేక మధ్యంతర ఎన్నికలకు 
వెళ్ళవలసి వచ్చింది. ఆపద్ధర్మ ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నారు. ఈ సమయంలోనే యన్టీఆర్ తన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' ను 1991 ఏప్రిల్ 19న విడుదల చేశారు యన్టీఆర్. సినిమాకు మిక్స్ డ్ టాక్ లభించింది. 
ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. మొదటి విడతలో తెలుగుదేశం పార్టీకి సీట్లు బాగానే వచ్చాయి. అదే సమయంలో రాజీవ్ గాంధీ మే 21న తమిళనాడులో హత్యకు గురయ్యారు. ఆయన 
మరణంతో సానుభూతి పవనాలు వీచి, రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘనంగానే సీట్లు లభించాయి. 

సెన్సేషన్... బిజినెస్...

అంతకుముందు 'బ్రహ్మంగారి చరిత్ర' బాక్సాఫీస్ వద్ద తరిగిపోని చెరిగిపోని రికార్డులు నెలకొల్పింది. దాంతో 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'కు కనీవినీ ఎరుగని బిజినెస్ జరిగింది. దాదాపు రాష్ట్రమంతటా ఈ సినిమాకు 'బెనిఫిట్ షోస్' వేయడం విశేషం! తెలుగు, హిందీ ఆడియోలు పెద్ద రేట్లకు అమ్ముడయ్యాయి. తెలుగులో 'లహరి' ద్వారా ఆడియో విడుదలై అమ్మకాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ రేట్లకు కొనుగోలు చేసిన బయ్యర్లకు నష్టం వాటిల్లింది. ఆ నష్టానికి తగ్గట్టుగా యన్టీయార్ డబ్బులు వాపస్ ఇచ్చారు.

హిందీ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' 

'బ్రహ్మర్షి విశ్వామిత్ర'ను మొదటి నుంచీ రామారావు హిందీలోనూ రూపొందించాలనుకున్నారు. అందువల్లే ఉత్తరాది సాంకేతిక నిపుణులతో పనిచేయించుకున్నారు. ఈ చిత్రానికి కొన్ని మార్పులూ చేర్పులూ చేసి, 
హిందీకి అనుగుణంగా తెరకెక్కించారు. హిందీలో బాలకృష్ణ కేవలం హరిచంద్ర పాత్రకే పరిమితం అయ్యారు. ఇదే చిత్రంలో బాల భరతునిగా జూనియర్ యన్టీఆర్ తొలిసారి నటించాడు. ఈ సినిమాను హిందీలో ఓ ప్రణాళిక లేకుండా విడుదల చేయగా, కొన్ని కేంద్రాలలోనే వెలుగు చూసింది. దాంతో రామారావు, ఈ హిందీ సినిమాను మరోమారు ఘనంగా విడుదల చేయాలని సంకల్పించారు. ఆ బాధ్యతను అప్పటికే హిందీ చిత్రాలు తీసి విజయం సాధించిన మన తెలుగు నిర్మాత డి.రామానాయుడుకు అప్పగించారు.  ఈ లోగా యన్టీఆర్ 1994లో మళ్ళీ ఘనవిజయం సాధించి, నాల్గవ సారి ముఖ్యమంత్రి కావడం, ఆ తరువాత 1995 ఆగస్టులో ఆయన మరోమారు పదవీచ్యుతుడు అవ్వడం జరిగిపోయాయి. ఓవైపు తనకు జరిగిన అన్యాయానికి పోరాటం చేస్తూనే, మరోవైపు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ వర్షన్ ను విడుదల చేసే యోచన చేశారు. అయితే 1996 జనవరి 18న రామారావు హఠాన్మరణంతో ఆయన కోరుకున్నట్టుగా హిందీ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' మళ్ళీ వెలుగు చూడలేకపోయింది. 

(ఏప్రిల్ 19 న 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'కు 30 ఏళ్ళు)