రైనా బంధువులపై దాడి చేసిన ముఠా అరెస్ట్‌...

రైనా బంధువులపై దాడి చేసిన ముఠా అరెస్ట్‌...

రైనా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గత నెల చివర్లో తన మామ‌ అశోక్‌ కుమార్ కుటుంబ సభ్యులంతా మేడ పై నిద్రిస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు‌ దాడి చేసారు. ఆ దుండుగుల దాడిలో అశోక్‌ ప్రాణాలు కోల్పోగా నలుగురు కుటుంబ సభ్యులు 'కుమార్ తల్లి సత్య దేవి, అతని భార్య ఆశా దేవి, కుమారులు అపిన్, కుశాల్ గాయాల కారణంగా ఆసుపత్రిలో చేరారు. అందులో కుశాల్ కుమార్‌ ఆగస్టు 31న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే అప్పుడు ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా పంజాబ్‌ పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ట్విట్ చేసిన రైనా దానిని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌కు ట్యాగ్ చేశాడు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం స్పెషల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ టీమ్‌ కు ఈ కేసు అప్పగించారు.

ఈ కేసులో సిట్ బృందం 100మంది అనుమానితుల్ని విచారించింది అని డీజీపీ తెలిపారు. ఇక నిన్న సిట్‌కు ఈ దాడికి సంబంధించిన ముగ్గురు అనుమానితుల గురించి సమాచారం అందింది. ఈ దాడికి పాల్పడిన వారు పఠాన్ ‌కోట్ రైల్వే స్టేషన్ సమీపంలోని గుడిసెల్లో ఉంటున్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులు ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణలో వారే ఈ నేరం చేసినట్లు తేలింది. ఇక వారి వద్ద నుండి అశోక్ కుమార్ ఇంట్లో నుంచి దోచుకెళ్లిన బంగారం అలాగే మిగితావి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ దాడిలో మరికొంత మంది కూడా ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారికోసం గాలింపు మొదలు పెట్టారు.

నేరస్థులను అరెస్ట్ చేసిన విషయం తెలుకున్న రైనా సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. తన ట్విట్ లో ''ఈ రోజు ఉదయం పంజాబ్ లో ముగ్గురు నేరస్థులను అరెస్ట్ చేసిన అధికారులను కలిశాను. వారి ప్రయత్నాలన్నింటినీ నేను నిజంగా అభినందిస్తున్నాను. మాకు ఏర్పడిన నష్టాన్ని ఎప్పటికి పూడ్చలేము కానీ ఇది మరిన్ని నేరాలు జరగకుండా చేస్తుంది'' అని రైనా తెలిపాడు.