షాకింగ్ : 254 మంది భారతీయులకు కరోనా

షాకింగ్ : 254 మంది భారతీయులకు కరోనా

ఇరాన్ తీర్థయాత్రకు వెళ్లిన 254 మంది భారతీయులకు కరోనా సోకిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్లందరిలో కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్టు ఇండియన్ మెడికల్ టీమ్ చేసిన టెస్టుల్లో తేలినట్టు చెప్పింది. ఇరాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశం తీసుకొస్తున్న విదేశాంగ శాఖ.. అక్కడున్నవారికి మొదట కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే ఢిల్లీ ఫ్లైటెక్కిస్తున్నారు. మిగతావారిని అక్కడే ఉంచేస్తున్నారు. ఇప్పుడు భారీఎత్తున కరోనా బాధితులు ఉండటంతో.. ఇరాన్ లో ల్యాబ్ ఏర్పాటుపై కేంద్రం ఆలోచనలు చేస్తోంది. అయితే ఇండియన్ మెడికల్ టీమ్స్ పాజిటివ్ అని చెప్పిన కేసుల్లో ఇరాన్ ఆస్పత్రుల్లో టెస్ట్ లు చేయించుకుంటే నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని యాత్రికులు చెబుతున్నారు.

ఎవరి పరీక్షలు నమ్మాలో తమకు అర్థం కావడం లేదని వాపోతున్నారు బాధితులు. ఇరాన్‌కు వెళ్లిన వీరంతా జమ్మూ కశ్మీర్, లడాఖ్ ప్రాంతాలకు చెందిన వారు. ఇక విదేశాల్లోని భారతీయుల యోగక్షేమాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ కొత్తగా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 72 ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఆప్ఘనిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేసియాల నుంచి భారత్‌కు ప్రయాణీకుల రాకను మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూర్తిగా నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఇది అమల్లో ఉంటుందని, పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. ఇప్పటికే కాగా ఐరోపా దేశాలు, టర్కీ, బ్రిటన్‌ ప్రయాణికులపై కూడా భారత్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.