ఇరవై ఏళ్ళ 'ఖుషి' 

ఇరవై ఏళ్ళ 'ఖుషి' 

'ఖుషి'- ఈ మాటంటే అందరికీ ఇష్టమే! ఖుషి కోరుకోని వారెవరుంటారు చెప్పండి!? అందువల్లే కాబోలు దర్శకుడు ఎస్.జె.సూర్య తన కథకు 'ఖుషి' అని టైటిల్ పెట్టి మరీ సినిమా తీశాడు. ముందు తమిళంలో వెలుగు చూసిన 'ఖుషి' కథ అక్కడి జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తరువాత తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా అదే కథను అదే 'ఖుషి' టైటిల్ తో తెరకెక్కిస్తే, ఇక్కడ మరింత బాగా అలరించింది. ఇదే సినిమాను హిందీలో కూడా ఎస్.జె.సూర్యనే మళ్ళీ 'ఖుషి' టైటిల్ తోనే రూపొందిస్తే అక్కడ ఫరవాలేదన్నారు. ఎస్.జె.సూర్య మూడు భాషల్లోనూ 'ఖుషి' టైటిల్ తోనే సాగాడు. అయితే ఆయనకు అమితానందం పంచింది మాత్రం తెలుగు 'ఖుషి' అనే చెప్పాలి. 2001 ఏప్రిల్ 27న విడుదలైన 'ఖుషి' చిత్రం యువతను కిర్రెక్కించింది. ఇందులోని పాటలు, మాటలు, సన్నివేశాలు అన్నీ యూత్ ను మురిపించాయి, మైమరిపించాయి. దాంతో చూసిన వారే ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ 'ఖుషి'గా 'ఖుషి'తో 'ఖుషి' చేస్తూ సాగారు. ఆ యేడాది విడుదలైన బంపర్ హిట్స్ లో 'ఖుషి' కూడా ఒకటిగా నిలచింది. 

యువతను ఆకట్టుకున్న కథ!
అసలు తెలుగునాట 'ఖుషి' అంతటి ఆదరణ పొందడానికి కారణమేంటి? ఈ సినిమా సమయానికి వరుస విజయాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. అప్పటికే ఆరు సక్సెస్ లు చూసిన పవన్ కు, 'ఖుషి' ఏడో సినిమా. అంతకు ముందు 'తొలిప్రేమ'తో తన కెరీర్ లో బిగ్ హిట్ ను పట్టేశాడు పవన్. ఆ పై వచ్చిన  మరో యూత్ ఫుల్ మూవీ ఈ 'ఖుషి' కావడంతో తొలి ఆట నుంచే కుర్రకారు ఈ సినిమాపై మనసు పారేసుకున్నారు. ఇందులో కథ అంతగా కనిపించదు. కథనమే యువతకు గిలిగింతలు పెడుతూ సాగుతుంది. ఇందులో హీరోహీరోయిన్లు ఒకరిపై ఒకరు మనసు పారేసుకుంటున్నట్టు మనకు తెలిసి పోతుంటుంది. వారు మాత్రం పెదవి విప్పి ఒకరికొకరు తమ ప్రేమ గురించి చెప్పుకోరు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కథ సాగుతూ ఉంటుంది. మధ్యలో ఆమె స్నేహితురాలు, ఇతని స్నేహితుడు ప్రేమించుకుంటారు. వారి ప్రేమకోసం సహకరిస్తూనే చివరి దాకా పోట్లాటలతో గడుపుతారు. చివరకు పెళ్ళయ్యాక పలువురు కవల పిల్లలను కంటారు. అదో రికార్డుగా భావించి, ఆ జంటను మీడియా ఇంటర్వ్యూ చేస్తూండడంతో కథ ముగుస్తుంది. ఇంతే కథ, కానీ, ఇందులో తన నడుము చూశావంటూ హీరోయిన్, చూడలేదంటూ హీరో పోట్లాడుకొనే సీన్ తరువాత పలు ట్విస్టులు సాగుతాయి. అవన్నీ అప్పటి యువతీయువకులను భలేగా ఆకట్టుకున్నాయి. 

పసందైన పాటలు
పవన్ కళ్యాణ్, భూమిక, ఆలీ, సుధాకర్, నాజర్, విజయ్ కుమార్, శివాజీ, ముంతాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు ప్రాణమని చెప్పాలి. మణిశర్మ  సంగీతం సమకూర్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గానూ నిలచింది. ఇందులోని పాటలలో "అమ్మాయే సన్నగా..." పాటను  చంద్రబోస్ రాశారు. "హోళీ హోళీరే..." సాంగ్ ను సుద్దాల అశోక్ తేజ పలికించారు. "ప్రేమంటే సులువు కాదురా", "చెలియ చెలియా.. పాటలను చిత్ర నిర్మాత ఎ.ఎమ్.రత్నం రాశారు.  "యే మేరా జహా..." అనే  హిందీ పాటను అబ్బాస్ టైర్ వాలా రాయగా, పాత 'మిస్సమ్మ'లోని "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..." అనే పాటను ఇందులో రీమిక్స్ చేశారు. ఈ ఆరు పాటలు కాకుండా, "రంగబోతి రంగబోతి..." , "బై బై యే బంగారు రమణమ్మ..." వంటి జానపదాల బిట్స్ వినిపిస్తాయి. ఈ పాటలను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడడం విశేషం. ఇక సినిమాలో రెండు ఫైట్స్ ను కూడా పవన్ కంపోజ్ చేయడం మరింత విశేషం. పి.సి.శ్రీరామ్ కెమెరా పనితనం కనువిందు చేసింది. ఈ సినిమాకు పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కాస్ట్యూమ్స్ రూపొందించారు. అలాగే"'యే మేరా జహా..." సాంగ్ లో కాసేపు రేణూ కూడా కనిపించారు. 

పలు రికార్డులు
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ నాటికీ 'ఖుషి'ది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ఈ సినిమా 101 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకొని, 79 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఏడు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. ఇప్పటి దాకా పవన్ కెరీర్ లో ఈ స్థాయిలో విజయం సాధించిన చిత్రం మరొకటి కానరాదు. ఈ సినిమా ఆ రోజుల్లో రూ.20 కోట్లు వసూలు చేసి, ఆ యేడాది బంపర్ హిట్స్ లో రెండో స్థానంలో నిలచింది. ఆ తరువాత పవన్ మరికొన్ని సూపర్ హిట్స్ లో నటించినా, ఆయన అభిమానులను విశేషంగా అలరించిన చిత్రంగా ఈ నాటికీ 'ఖుషి' నిలిచే ఉంది.