గాయాల బెడద : నాలుగో టెస్టుకు జట్టు కూర్పుపై రాని క్లారిటీ

గాయాల బెడద : నాలుగో టెస్టుకు జట్టు కూర్పుపై రాని క్లారిటీ

ఆసీస్ పర్యటనలో భారత జట్టును గాయాలు వదిలిపెట్టడం లేదు. అయితే బ్రిస్బేన్‌ వేదికగా జరిగే ఆఖరి టెస్టుకు గాయంతో బుమ్రా కూడా దూరమవుతున్నాడని ప్రకటించడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. తుదిజట్టును ఎలా ఎంపికచేయాలో తెలియక జట్టు యాజమాన్యం తల పట్టుకుంటోంది. రిజర్వ్‌ బెంచ్ బలంగా ఉండటం కాస్త ఊరటనిస్తున్నా.. సీనియర్లు లేని లోటుని జూనియర్లు భర్తీ చేయగలరా అనేది ప్రశ్నగా మారింది. అదీకాక.. గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఎలా పోరాడుతుందన్న అంశంపైనా అందరి దృష్టి నెలకొని ఉంది.

సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్ కుమార్‌ పిక్క కండరాల గాయంతో ఆస్ట్రేలియా పర్యటన ఎంపికకు అందుబాటులో లేడు. మరో పేసర్ ఇషాంత్ శర్మ..పక్కటెముకల గాయంతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.  ఐపీఎల్‌లో సత్తాచాటిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ భుజం గాయంతో దూరమయ్యాడు. తొడకండరాల గాయంతో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక కాలేదు. టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా షమి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు చివరి మూడు టెస్టులకు దూరమై స్వదేశానికి వచ్చాడు. సీనియర్‌ పేసర్ ఉమేశ్‌ యాదవ్ రెండో టెస్టులో గాయపడ్డాడు. కాలి పిక్క పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలియడంతో స్వదేశానికి పయనమయ్యాడు. ప్రాక్టీస్‌లో మణికట్టు బెణకడంతో ఒక టెస్టు కూడా ఆడకుండానే కేఎల్ రాహుల్‌ స్వదేశానికి పయనమయ్యాడు. తొలి వన్డేలో తొడకండరాల గాయంతో ఇబ్బంది పడిన రవీంద్ర జడేజా త్వరగా కోలుకుని రెండో టెస్టు నుంచి జట్టుతో చేరాడు. కానీ సిడ్నీ టెస్టులో మరోసారి గాయపడ్డాడు. స్టార్క్‌ వేసిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. స్వదేశంలో జరగనున్న ఇంగ్లాండ్‌ టెస్టుకు కూడా అతడు దూరం కానున్నాడు..సిడ్నీ టెస్టు హీరో హనుమ విహారి ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. గ్రేడ్-2 స్థాయిలో పిక్క గాయమైంది. దీంతో బ్రిస్బేన్‌ టెస్టుకు అందుబాటులో లేడు.సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీవ్ర నడుం నొప్పితోనే మూడో టెస్టు ఆడాడు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టుకు అనుమానమే అని భావిస్తున్నారంతా. అయితే ఫిజియో, వైద్యసాయంతో అశ్విన్ బ్రిస్బేన్‌ టెస్టు ఆడే అవకాశం ఉంది. వీళ్లతో పాటు పితృత్వ సెలవులపై కోహ్లీ కూడా చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. 

కీలక ఆటగాళ్లు దూరమైనా మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌తో పేస్‌ విభాగం బలంగానే ఉంది. కానీ అనుభవం లేని ఈ పేస్‌ దళం ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడిచేస్తారనేది ప్రశ్న. ఇక వృద్ధిమాన్‌ సాహా, పృథ్వీ షాతో బ్యాటింగ్‌ రిజర్వ్‌ బెంచ్‌ ఫర్వాలేదనిపిస్తోంది. అయితే విహారి, జడేజా, బుమ్రా ఆఖరి టెస్టుకు దూరమవ్వడంతో జట్టు కూర్పు ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది