కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ మళ్లీ పరవళ్ళు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్ట్‌ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్‌లోకి లక్షా 83,657 క్యూసెక్కుల నీరువస్తుండగా.. 3,48,412 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం నుంచి.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,543 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. మొత్తంగా 3,78,955 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో మరింత పెరుగుతోంది. 

ఇక, శ్రీశైలం నుంచి భారీస్థాయిలో వరద వస్తుండడంతో.. నాగార్జునసాగర్ 20 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్‌ఫ్లో మొత్తంగా 3,78,955 క్యూసెక్కులుగా ఉండగా.. 20 గేట్ల ద్వారా 3,78,955 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 311.4474 టీఎంసీలుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులుగా ఉంది. ఇక, అటు శ్రీశైలంతో పాటు.. ఇటు నాగార్జునసాగర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. కోవిడ్ దృష్ట్యా.. ఎక్కువ మందికి అనుమతించడంలేదు అధికారులు.