కరోనా కల్లోలం... ఒకేరోజు లక్షకుపైగా కొత్త కేసులు..

కరోనా కల్లోలం... ఒకేరోజు లక్షకుపైగా కొత్త కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది.  213 దేశాలకు విస్తరించిన మహమ్మారికి రోజూ వేలాది మంది బలవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో  లక్ష కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. అమెరికా, రష్యాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్ దేశాల్లోనూ దారుణ పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడ్డవారి సంఖ్య 52 లక్షలకు చేరువైంది. కరోనా దెబ్బకు 3.34 లక్షల మందికి పైగా చనిపోయారు. ఇప్పటివరకు కరోనా నుంచి 20.80 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

మరోవైపు, అమెరికాలో మళ్లీ కేసులు పెరిగాయి. ఒక్క రోజే 28 వేలకు పైగా కేసులు రావడంతో యూఎస్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16.20 లక్షలు దాటింది. కరోనాతో ఒక్కరోజే 1,418 మంది చనిపోవడంతో… మొత్తం మరణాలు లక్షకు చేరువయ్యాయి. ఇక మనదేశంలో కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది. రోజురోజుకూ బలపడుతోంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదువుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా లక్షా 20 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,605మంది చనిపోయారు. రష్యాలో గత 24 గంటల్లో 8,849 కేసులు వచ్చాయి. దీంతో ఆదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.17 లక్షలు దాటింది. బ్రెజిల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కరోజే 17 వేల కేసులు నమోదు కాగా.. 1,188 మంది చనిపోయారు. బ్రిటన్‌లో మరో 338 మంది కరోనాకు బలయ్యారు.