కోవిడ్ వ్యాక్సినేషన్‌.. భారత్‌ మరో మైలురాయి..

కోవిడ్ వ్యాక్సినేషన్‌.. భారత్‌ మరో మైలురాయి..

వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి మందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు భారత్‌ ఇప్పటికే 25 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయగా మరో 49 కన్‌సైన్‌మెంట్లను పూర్తిచేయనుందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళాల కోసం ‌ రెండు లక్షల డోస్‌లను పంపుతామని ఇప్పటికే ప్రకటించింది. కాగా భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌తో పాటు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు.. దాదాపు 130 దేశాలకు ఇంకా వ్యాక్సిన్ అందలేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని కోరింది. ఆర్థికంగా బలమైన దేశాలు దీని కోసం ముందుకు రావాలని సూచిచింది.