ప్రముఖ మలయాళ నటుడు రిజబావా కన్నుమూత!

ప్రముఖ మలయాళ నటుడు రిజబావా (55) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొచ్చిలోని ప్రైవేట్ హాస్పటిల్ లో కిడ్నీకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లలో మలయాళ చిత్రసీమలో గుణచిత్ర నటుడిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించారు రిజబావా.

నాటక రంగం నుండి చిత్రసీమలోకి ఆయన 1984లో ‘విష్ణుపక్షి’ చిత్రంతో అడుగుపెట్టారు. అయితే ఆ మూవీ విడుదల కాలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు ఆయన నటించిన ‘డాక్టర్ పశుపతి’ చిత్రంతో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నారు రిజబావా. ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నటి పార్వతికి జోడీగా ఆయన నటించారు. అదే సంవత్సరం వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీ ‘ఇన్ హరిహర్ నగర్’లో జాన్ హోనై అనే విలన్ పాత్రను పోషించి మెప్పించారు. అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాదాపు 150 చిత్రాలలో నటించిన రిజబావా పలు టీవీ సీరియల్స్ లోనూ చేశారు. చివరగా ఆయన మమ్ముట్టి నటించిన ‘వన్’ చిత్రంలో నటించారు. రిజబావా మృతికి మలయాళ చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.

Related Articles

Latest Articles

-Advertisement-