కుటుంబ క‌థాచిత్రాల‌కు పెట్టింది పేరు… పి.సి.రెడ్డి!

తెలుగు చిత్ర‌సీమ‌లో పి.సి.రెడ్డిగా సుప్ర‌సిద్ధులు పందిళ్ళ‌ప‌ల్లి చంద్ర‌శేఖ‌ర రెడ్డి. ఆయ‌న సినిమా అంటే చాలు అందులో తెలుగు వాతావ‌ర‌ణం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించేది. ముఖ్యంగా ప‌ల్లెసీమ‌ల ప‌చ్చ‌ద‌నం న‌డుమ పి.సి.రెడ్డి సినిమాలు నాట్యం చేశాయ‌ని చెప్ప‌వ‌చ్చు. వాటిలో కుటుంబ‌క‌థ‌లే మిన్న‌గా తెర‌కెక్కించారు. అందువ‌ల్లే పి.సి.రెడ్డి సినిమా అన‌గానే ఓ చ‌క్క‌ని కుటుంబ క‌థ‌ను చూడ‌వ‌చ్చున‌ని ప్రేక్ష‌కులు సైతం భావించేవారు. స‌దా నిర్మాత శ్రేయ‌స్సు కాంక్షిస్తూ, త‌న నిర్మాత‌కు త‌న వ‌ల్ల ఓ రూపాయి ఆదాయం రావాల‌నే అభిలాష‌తోనే పి.సి.రెడ్డి చిత్రాలు రూపొందించారు. ఆ సినిమా చేయాలి, ఈ చిత్రం తీయాలి అని ఎదురుచూడ కుండా త‌న ద‌రికి చేరిన సినిమాలు రూపొందిస్తూ పోయారు. అంతే త‌ప్ప‌, ఏ నాడూ డ‌బ్బుకు ప్రాధాన్య‌మిచ్చిన వారు కారు. దాదాపు 75 చిత్రాలు తెర‌కెక్కించిన పి.సి.రెడ్డి వ‌ద్ద అసోసియేట్స్ గా ప‌నిచేసిన బి.గోపాల్, ముత్యాల సుబ్బ‌య్య‌, శ‌ర‌త్, పి.య‌న్. రామ‌చంద్ర‌రావు, వై.నాగేశ్వ‌ర‌రావు వంటి వారు త‌రువాతి రోజుల్లో గురువుకు త‌గ్గ శిష్యులు అనిపించుకుంటూ మంచి విజ‌యాల‌ను చూశారు. న‌ట‌శేఖ‌ర కృష్ణ‌తో అత్య‌ధిక చిత్రాల‌ను రూపొందించారు పి.సి.రెడ్డి. దాంతో కృష్ణ ద‌ర్శ‌కుడు అన్న ముద్ర ప‌డింది.ఆ కార‌ణంగానే ఆయ‌న‌కు ఇత‌రుల‌తో సినిమాలు తీసే అవ‌కాశం త‌గ్గిందేమో అనిపిస్తుంది.

పి.చంద్ర‌శేఖ‌ర రెడ్డి 1933 అక్టోబ‌ర్ 15వ తేదీన నెల్లూరు జిల్లా అనుమ‌స‌ముద్రంలో జ‌న్మించారు. చ‌దువుకొనే రోజుల నుంచీ పి.సి.రెడ్డికి ల‌లిత‌క‌ళ‌లంటే త‌ర‌గ‌ని మ‌క్కువ ఉండేది. మూడ‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సొంత‌వూరులో చ‌దువుకున్న పి.సి.రెడ్డి, త‌రువాత త‌న అన్న బల‌రామిరెడ్డి వ‌ద్ద‌కు వెళ్ళి మ‌ద్రాసులోనే డిగ్రీ పూర్తిచేశారు. ప‌చ్చ‌య్య‌ప్ప క‌ళాశాల‌లో ఆయ‌న చ‌దువుకొనే రోజుల్లోనే వి.మ‌ధుసూద‌న‌రావు, వ‌ల్లం న‌ర‌సింహారావు వంటి సినీప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యం క‌లిగింది. వ‌ల్లం న‌ర‌సింహారావు ప్రోత్సాహంతో శ్రీ‌కృష్ణ‌రాయ‌బారం చిత్రానికి ఆ సినిమా ద‌ర్శ‌కుడు ఎన్.జ‌గ‌న్నాథ్ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశారు. త‌రువాత వి.మ‌ధుసూద‌న‌రావు వ‌ద్ద దాదాపు 11 సంవ‌త్స‌రాలు అసిస్టెంట్ గా,అసోసియేట్ డైరెక్ట‌ర్ గా,కో డైరెక్ట‌ర్ గా రాణించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కె.రాఘ‌వేంద్ర‌రావు, ఎ.కోదండ‌రామిరెడ్డి కూడా మ‌ధుసూద‌న‌రావు వ‌ద్ద ప‌నిచేసే రోజుల్లో పి.సి.రెడ్డి స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకున్న‌వారే. పి.సి.రెడ్డికి అనూరాధ‌ చిత్రంతో దర్శ‌కునిగా అవ‌కాశం ల‌భించింది. అయితే ఈ సినిమా కంటే ముందు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కృష్ణ అత్త‌లు-కోడ‌ళ్ళు, శోభ‌న్ బాబు విచిత్ర దాంప‌త్యం విడుద‌ల‌య్యాయి. ఈ రెండు సినిమాలు 1971 ఏప్రిల్ 14న ఒకే రోజు జ‌నం ముందు నిలిచాయి. ద‌ర్శ‌కునిగా పి.సి.రెడ్డికి మంచి పేరు ల‌భించింది. త‌రువాత అదే సంవ‌త్స‌రం అనూరాధ‌ కూడా విడుద‌ల‌యింది.

Read Also : టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత

కృష్ణ‌తో దాదాపు 20కి పైగా చిత్రాలు తెర‌కెక్కించారు చంద్ర‌శేఖ‌ర రెడ్డి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తొలి హిట్ గా నిల‌చిన అత్త‌లు - కోడ‌ళ్ళులోనూ, తొలి సిల్వ‌ర్ జూబ్లీ సినిమాగా రూపొందిన ఇల్లు-ఇల్లాలులోనూ కృష్ణ‌నే క‌థానాయ‌కుడు. ఇక అల్లూరి సీతారామరాజు త‌రువాత వ‌రుస ఫ్లాపులు చూసిన కృష్ణ‌కు చంద్ర‌శేఖ‌ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పాడిపంట‌లు మంచి విజ‌యాన్ని అందించింది. ఆ త‌రువాత కృష్ణ హీరోగా స్నేహ‌బంధం, గౌరి, కొత్త‌కాపురం, ప‌గ‌బ‌ట్టిన సింహం, బంగారుభూమి, నా పిలుపే ప్ర‌భంజ‌నం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు రూపొందించారు. శోభ‌న్ బాబుతో పి.సి.రెడ్డి తెర‌కెక్కించిన మాన‌వుడు-దాన‌వుడు సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ త‌రువాత వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన చిత్రాలేవీ అంత‌గా అల‌రించ‌లేదు.

మ‌హాన‌టుడు య‌న్టీఆర్ తో పి.చంద్ర‌శేఖ‌ర రెడ్డి బ‌డిపంతులు చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాతో య‌న్టీఆర్ కు ఉత్త‌మ న‌టునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డు ల‌భించింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇందులోని భార‌త‌మాత‌కు జేజేలు... బంగ‌రు భూమికి జేజేలు... పాట ఈ నాటికీ జ‌నాన్ని అల‌రిస్తూనే ఉంది. ఈ సినిమాలోనే య‌న్టీఆర్ కు శ్రీ‌దేవి మ‌న‌వ‌రాలుగా న‌టించారు. ఆ త‌రువాత య‌న్టీఆర్, శ్రీ‌దేవి జంట ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తూ సాగింది.ఆ స‌మ‌యంలో వారిద్ద‌రితో ఓ సినిమా తీయాల‌ని ఉంద‌ని అభిల‌షించారు పి.సి.రెడ్డి. అది నెర‌వేర‌లేదు.కానీ, శ్రీ‌దేవి నాయిక‌గా ఆయ‌న రూపొందించిన బంగారు భూమి మంచి ఆద‌ర‌ణ పొందింది. మ‌రో మ‌హాన‌టుడు ఏయ‌న్నార్ తో పి.సి.రెడ్డి తాండ‌వ‌కృష్ణుడు చిత్రం రూపొందించారు. ఆ చిత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయింది. చంద్ర‌శేఖ‌ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మాదాల రంగారావు తొలిపొద్దు అనే చిత్రం తెర‌కెక్కించారు.
వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న రెడ్డి క‌థ అంటూ జ‌గ‌న్నాయ‌కుడు అనే చిత్రం పి.సి.రెడ్డి ద‌ర్శక‌త్వంలోనే రూపొంది 2014లో విడుద‌ల‌యింది.

పి.చంద్ర‌శేఖ‌ర రెడ్డి తెర‌కెక్కించిన 75 చిత్రాల‌లో అత్య‌ధికం కుటుంబ క‌థాచిత్రాలే! వాటిలోనూ సంగీత‌సాహిత్యాల‌కు ఆయ‌న పెద్ద పీట వేసేవారు. బ‌డిపంతులులోని భార‌త‌మాత‌కు జేజేలు..., బూచాడ‌మ్మా బూచాడు... పాట‌లు ఎంత‌గానోఆక‌ట్టుకోగా, అత్త‌లూ -కోడ‌ళ్ళులోని పాల‌పిట్టా పాల‌పిట్టా ప‌రుగులెందుకు..., ఇల్లు-ఇల్లాలులోని ఇల్లే ఇల‌లో స్వ‌ర్గ‌మ‌ని...ఇల్లాలే ఇంటికి దేవ‌త‌నీ... వంటి పాట‌లూ అల‌రించాయి. ఇక మాన‌వుడు-దాన‌వుడులోని అణువూ అణువున వెల‌సిన దేవా...`` పాట భావిత‌రాల‌ను సైతం ఆక‌ట్టుకుంటూనే ఉంది.పాడిపంట‌లు`లోని మ‌న జ‌న్మ‌భూమి బంగారుభూమి..., ప‌నిచేసే రైత‌న్నా... వంటి పాటలు ఈ నాటికీ రైతుల‌కు ఆనందం పంచుతూనే ఉన్నాయి. ఆయ‌న చిత్రాల్లోని స్నేహ‌బంధ‌మూ ఎంత మ‌ధుర‌మూ (స్నేహ‌బంధం), కాపురం కొత్త కాపురం...( కొత్త‌కాపురం), చేసేది ప‌ట్న‌వాసం... కాసేది ప‌ల్లెల గ్రాసం... (ప‌ట్న‌వాసం), బోగుల్లో బోగుల్లో... (భోగ‌భాగ్యాలు) వంటి పాట‌లు ఈ నాటికీ సంద‌ర్భాను సారంగా జ‌నం గుర్తు చేసుకుంటూనే ఉండ‌డం విశేషం!

Related Articles

Latest Articles