విలక్షణ నటదర్శకుడు పేకేటి శివరామ్

(అక్టోబర్ 8న నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్ జయంతి)

నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్ తెలుగు చిత్రసీమ బుడి బుడి అడుగులు వేసే నాటి నుంచీ సినిమా రంగంలో ఉన్నారు. అనేక చిత్రాలలో హాస్యరసం కురిపించారు. కొన్నిట విలనీ పండించారు. తన నవ్వుతోనే ఇతరులను ఇట్టే ఆకట్టుకొనేవారు పేకేటి శివరామ్. అందుకే ఆ రోజుల్లో అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. మాతృభాష తెలుగులోనే కాదు, కన్నడ చిత్రసీమలోనూ పేకేటి శివరామ్ రాణించారు.

పేకేటి శివరామ్ 1918 అక్టోబర్ 8న తూర్పు గోదావరి జిల్లా పేకేరులో జన్మించారు. చిన్నతనంలో చదువులో దిట్ట. లలితకళలపై ఎంతో ఆసక్తి ఉండేది. నాటకాలలో నటిస్తూ సినిమా రంగంవైపు పరుగు తీశారు. ఈ పని ఆ పని అని లేకుండా చిత్రసీమలో అన్ని పనులూ చేసుకుంటూ జీవనం సాగించారు పేకేటి శివరామ్. ఆ నాటి మేటి నిర్మాణ సంస్థలు పేకేటి శివరామ్ ను తమ ఆస్థాన ఉద్యోగిగా చెప్పుకోడానికి ఎంతో గర్వపడేవి. ఎందుకంటే చిత్రసీమకు సంబంధించిన అన్ని శాఖలపైనా ఆయనకు అంతలా పట్టుండేది. సమయానికి ఏదైనా అందుబాటులో లేకపోతే, నటీనటుల సమయం వృధా కాకుండా పేకేటి శివరామ్ చిత్రీకరణ కొనసాగేలా చూసేవారు. ఈ లక్షణం ప్రతిభా సంస్థ అధినేత ఘంటసాల బలరామయ్యకు ఎంతగానో నచ్చింది. తన సంస్థ కార్యాలయంలోనే పేకేటికి ప్రత్యేక గదిని కేటాయించి, చిత్రీకరణ సమయంలో పేకేటి సలహాలు తీసుకొనేవారు. అదే సంస్థ నిర్మించిన ‘సీతారామజననం’తోనే అక్కినేని నాగేశ్వరరావు చిత్రసీమకు పరిచయమయ్యారు. అలా ఆ సినిమా నుండే పేకేటితో ఏయన్నార్ కు అనుబంధం ఏర్పడింది. ఇక మీర్జాపురం రాజావారికి కూడా పేకేటి సన్నిహితునిగా ఉండేవారు. రాజావారి భార్య, నటి కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’తోనే యన్టీఆర్ చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆ సమయంలోనే నందమూరితో పేకేటికి పరిచయం కుదిరింది. అలా ఇద్దరు మహానటులతో తనకు ఉన్న అనుబంధాన్ని కడదాకా కొనసాగించారు పేకేటి శివరామ్. వినోదా సంస్థ అధినేత డి.ఎల్.నారాయణతోనూ పేకేటికి సత్సంబంధాలు ఉండేవి. డి.ఎల్. నిర్మించిన ‘దేవదాసు, చిరంజీవులు’ వంటి చిత్రాలలో పేకేటి కీలక పాత్రలు పోషించారు. యన్టీఆర్, ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలలో పేకేటి శివరామ్ నటించారు.

తెలుగు చిత్రసీమలో అప్పటికే చిత్తూరు నాగయ్య స్టార్ గా వెలుగొందారు. ఆయనను అనేక సంస్థానాలు ఘనంగా సన్మానించాయి. ఆయనను అభినందిస్తూ పలు ప్రశంసలు కురిపించాయి. ఆ సమయంలోనే నాగయ్య పేరిట అభిమాన సంఘం నెలకొంది. అయితే తెలుగునాట అభిమాన సంఘాలకు ఓ ఊపు తీసుకు రావడంలో పేకేటి శివరామ్ పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘికాల్లో యన్టీఆర్ తనదైన బాణీ పలికిస్తూ ఆల్ రౌండర్ గా సాగుతున్న సమయంలోనే ‘అఖిల భారత యన్టీఆర్ అభిమాన సంఘం’ నెలకొల్పారు పేకేటి. అంతకు ముందు యన్టీఆర్, ఏయన్నార్ కు అభిమాన సంఘాలు ఏదో ఉండేవంటే ఉండేవి. కానీ, అభిమాన సంఘాలకు కూడా రిజిస్ట్రేషన్ చేయించి, వాటి ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించవచ్చునని చేసి చూపించారు పేకేటి. తరువాత ఏయన్నార్ పేర కూడా ఓ అభిమాన సంఘం నిర్వహించారు.

యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన జానపద చిత్రం ‘గులేబకావళి కథ’లో పేకేటి శివరామ్ హీరోకు అన్నల్లో ఒకరిగా నటించారు. అంతకు ముందు యన్టీఆర్ సొంత చిత్రాలు “పాండురంగ మహాత్మ్యం, రేచుక్క పగటిచుక్క”ల్లోనూ కీలక పాత్రలు ధరించారు పేకేటి. అప్పటి నుంచీ యన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించాలన్న అభిలాషతో కథలు వినిపించేవారు. చివరకు కన్నడలో రాజ్ కుమార్ తో తాను రూపొందించిన ‘కులగౌరవ’ (1971) చిత్రాన్ని తెలుగులో యన్టీఆర్ తో ‘కులగౌరవం’ (1972)పేరుతో రూపొందించారు. ఈ చిత్రాన్ని యన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. పతాకంపై నిర్మించారు. యన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రంగా ‘కులగౌరవం’ నిలచింది.

పేకేటి శివరామ్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సంతానంలో ఒకరైన పేకేటి రంగా ప్రముఖ కళా దర్శకునిగా రాణిస్తున్నారు. ఇక ఆయన రెండో భార్య నటి జయంతి. ఆమె నటించిన కొన్ని చిత్రాలకు కన్నడనాట దర్శకత్వం వహించారు పేకేటి. నటి జయంతి ఈ మధ్యే కన్నుమూశారు. తెలుగులో “భలే అబ్బాయిలు, చుట్టరికాలు” వంటి చిత్రాలకూ ఆయన దర్శకుడు. ఆయన నటించిన చివరి చిత్రం నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఖరి పోరాటం’. ఏది ఏమైనా పేకేటి శివరామ్ పేరు వినగానే ఇప్పటికీ ఆ నాటి సినీ అభిమానులకు ఆయన హాస్యం ముందుగా గుర్తుకు వస్తుంది. తరువాత అభిమాన సంఘాల ఏర్పాటూ స్ఫురిస్తుంది.

-Advertisement-విలక్షణ నటదర్శకుడు పేకేటి శివరామ్

Related Articles

Latest Articles