కోనసీమలో రాజకీయ పందెంకోళ్లు…వైసీపీ v/s టీడీపీ

సంక్రాంతికి ముందే కోనసీమలో రాజకీయ పందెంకోళ్లు సెగ పుట్టిస్తున్నాయా? రోడ్డు పనులపై రచ్చ రంబోలా అవుతోందా? వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు.. విమర్శలు.. అవినీతిలో కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తున్నాయా? రాజకీయంగా వేడెక్కిస్తున్న అంశాలేంటి? తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం-కొత్తపేట రోడ్డు నిర్మాణ పనులు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి. పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అనేక మలుపులు తిరిగి వైసీపీ, టీడీపీ మధ్య రచ్చ రచ్చ అవుతోంది. అధ్వాన్నంగా తయారైన ఈ రహదారికి మరమ్మతులు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీలు ధర్నా చేశాయి. పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని చెబుతూ.. ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తాత్కాలికంగా మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. సొంత నిధులతో పనులు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అక్కడి నుంచి రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ.. ప్రస్తుతం నేతల మధ్య సవాళ్ల స్థాయికి వెళ్లింది.

సొంత నిధులైతే ఎమ్మెల్యేకు సన్మానం చేస్తామన్న టీడీపీ నేత
సొంత నిధులతో రోడ్డు బాగు చేయిస్తే పార్టీలను పక్కన పెట్టి జగ్గిరెడ్డికి సన్మానం చేస్తామన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం. ఆ మాటల్లో వెటకారం ఉందని అనుకున్నారో ఏమో.. సుబ్రమణ్యానికి ధన్యవాదాలు చెబుతూనే కౌంటర్లు వేశారు. కొత్త రోడ్డు వేయడానికి 8 కోట్ల 20 లక్షలు వెచ్చించడం తనకు శక్తికి మించిన పని అని.. గుంతలు పూడ్చినట్టు జగ్గిరెడ్డి తెలిపారు. టెండర్లు పిలిచి కొత్త రోడ్డు పనులు మొదలైనట్టు వెల్లడించారు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో దెబ్బతిన్న మరికొన్ని రహదారులను కూడా ఇదే విధంగా కాంట్రాక్టర్లను ఒప్పంచి పనులు చేపడతామని తెలిపారాయన.

కల్యాణ మండపాలకు పేర్లు మార్చాలన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
రోడ్లయినా, కల్యాణ మండపాలైనా ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తారని.. గతంలో ఈ విధంగా నిర్మించిన కల్యాణ మండపాలకు జ్యోతిరావు పూలే, వంగవీటి రంగా పేర్లు పెడితే బాగుండేదని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పేర్లు మార్పిస్తే రెడ్డి సుబ్రమణ్యానికి తన ఖర్చులతో గ్రాండ్‌గా షష్టిపూర్తి చేయిస్తానని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని అనుకున్నారో ఏమో రెడ్డి సుబ్రమణ్యం సవాళ్ల పర్వం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేగా పన్నెండేళ్ల కాలంలో జగ్గిరెడ్డి ఏం చేశారో.. ఎమ్మెల్సీగా ఆరేళ్లకాలంలో తానేం చేశానో వెల్లడించడానికి రెడీ అని తొడకొట్టారు. కల్యాణ మండపాలకు ఎవరెంత విరాళాలు ఇచ్చారో సుబ్రమణ్యం బయటపెట్టారు. వాటిల్లో కొన్నింటికి ప్రభుత్వం నుంచి ఇంకా బిల్లులు రాలేదని.. ఎమ్మెల్యే వాటి బాధ్యత తీసుకోవాలని సూచించారు.

వాస్తవాలు తెలిసి అవాక్కవుతున్న జనం
రోడ్ల దగ్గర మొదలైన పంచాయితీ కల్యాణ మండపాల దగ్గర తేలడంతో.. వాటిల్లో ప్రభుత్వ వాటా ఎంత.. ప్రజల విరాళం ఎంతో స్థానికులకు మొదటిసారి తెలిసిందట. అయితే రోడ్ల రాజకీయం ఇంకా చల్లారలేదు. మరిన్ని అంశాలు తవ్వుకునేలా జగ్గిరెడ్డి, సుబ్రమణ్యంలు సవాళ్లు చేసుకుంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో మరుగున పడ్డ మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని అనుకుంటున్నారు జనం. ఇదే విధంగా కొన్నేళ్లుగా సాగుతున్న మట్టి, ఇసుక మాఫియా లెక్కలు కూడా బయటపెడితే బాగుంటుందని మరికొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేశారు. మరి..ఈ సమస్య కోనసీమ రాజకీయాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.

Related Articles

Latest Articles