తెలంగాణలో బిగ్ ఫైట్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ @ సెప్టెంబర్ 17!

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. టీఆర్ఎస్ నేతలంతా హుజూరాబాద్ పై దృష్టి పెట్టగా.. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం తమ తమ రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ముందుకు పోతున్నాయి. ఈ క్రమంలో.. బీజేపీ నేతలు ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం.. ఆయన రాక ఖరారైంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖకు.. కేంద్ర హోం శాఖ మంత్రి కార్యాలయం నుంచి స్పందన వచ్చింది. ఆయన రాష్ట్రానికి వస్తున్నారని బదులు వచ్చింది. దీంతో.. రెట్టించిన ఉత్సాహంతో కమలదళం ముందుకు కదులుతోంది. ఈ నెల 17న నిర్మల్ లో భారీ స్థాయిలో సభ నిర్వహించి.. పార్టీని మరింతగా జనంలోకి తీసుకువెళ్లేందుకు నాయకత్వం కసరత్తు చేస్తోంది. సభను విజయవంతం చేయడంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సెప్టెంబర్ 17 నాటికి నిర్మల్ చేరుకునేలే ప్లాన్ చేస్తున్నారు. అమిత్ షా రాకను.. పార్టీలో సమరోత్సాహం నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు సైతం.. ఇందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించి.. అదే సెప్టెంబర్ 17న ఆ పార్టీ నేతలు వరంగల్ వేదికగా మహా సభ నిర్వహించాలని అనుకున్నారు.

కానీ.. రాహుల్ గాంధీకి వేరే పనులు ఉన్న దృష్ట్యా.. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేకపోయింది. అయినా రేవంత్ రెడ్డి ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వేదికను మార్చి.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో సభ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్నీ కుదిరితే.. అదే సెప్టెంబర్ 17న.. గజ్వేల్ లో కాంగ్రెస్ సభ నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది. అతి త్వరలో ఈ విషయమై పార్టీ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదంతా చూస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయం చేసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయాలను ఈ సభలు కచ్చితంగా మరింత ముందుకు తీసుకుపోవడం ఖాయమని విశ్లేషకులతో పాటు.. జనాలు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-