ఆలేరు టీఆర్ఎస్ లో వేడెక్కిన రాజకీయం…!

నిన్న మొన్నటి వరకు ఆ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో పెద్దగా చడీచప్పుడు లేదు. వరసగా రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేదే అక్కడ హవా. ఆ తర్వాత ఓ మాజీ ఎమ్మెల్యే చేరిక.. తాజాగా మరో మాజీ మంత్రి రాకతో సీన్‌ మారిపోయింది. ఆధిపత్యపోరు ఓ రేంజ్‌లో ఉంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు?

ఆలేరు టీఆర్‌ఎస్‌లో వేడెక్కిన రాజకీయం..!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైన ఆలేరు నియోజకవర్గంలో రాజకీయం రంగు మారుతోంది. 2014, 2018 ఎన్నికల్లో గొంగడి సునీత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అధికార పార్టీలో మరో లీడర్‌ లేకపోవడంతో.. నిన్న మొన్నటి వరకు ఆలేరులో సునీత చెప్పిందే వేదం. పార్టీ కేడర్‌లో ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉన్నా.. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో గొంతెత్తినవారే లేరు. అలాంటి ఆలేరు టీఆర్ఎస్‌లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత పొలిటికల్‌ సెగలు రాజుకుంటున్నాయి. ఆ మాజీ ఎమ్మెల్యేలు ఒకరు బూడిద భిక్షమయ్య గౌడ్‌ కాగా.. రెండో నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.

మోత్కుపల్లి ఎంట్రీతో మరింత వేడెక్కిన రాజకీయం..!

అనుచరులతో కలిసి భిక్షమయ్య గౌడ్‌ టీఆర్ఎస్‌ కండువా కప్పుకొన్నా.. వారికి ఎమ్మెల్యే చెక్‌ పెడుతున్నారట. మాజీ ఎమ్మెల్యే వర్గానికి పార్టీలో స్థానికంగా ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదట. సునీత తీరుపై వారంతా కుతకుతలాడుతున్నా.. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో పెదవి విప్పడం లేదు. ఎమ్మెల్యే సునీత.. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ మధ్య వర్గపోరు జరుగుతున్న క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఎంట్రీ పరిస్థితిని మరింత వేడెక్కించింది. ఎమ్మెల్యే రెడ్డి సామాజికవర్గం.. భిక్షమయ్య గౌడ్‌ బీసీ సామాజికవర్గం.. మోత్కుపల్లి ఎస్సీ సామాజికవర్గం కావడంతో లోకల్‌ టీఆర్ఎస్‌ పాలిటిక్స్‌ హాట్ హట్‌గా మారాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కోసం ముగ్గురూ పావులు..!

భిక్షమయ్య గౌడ్‌ను టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడిని చేస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. హుజురాబాద్‌ ఉపఎన్నిక తర్వాత.. పార్టీలో మొత్తానికి మొత్తం జిల్లా అధ్యక్షుల నియామక ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా.. ఇప్పటి నుంచే ముగ్గురు నేతలు పావులు కదుపుతున్నారట. మోత్కుపల్లికి ఇచ్చే పదవిపై అధికారపార్టీలో ఇంకా చప్పుడు లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఆలేరు టికెట్‌ అడుగుతారో లేదో తెలియదు. 2018 మాదిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ అని పార్టీ ప్రకటిస్తే.. భిక్షమయ్య గౌడ్‌ ఏం చేస్తారన్నది ప్రశ్న. తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తారా లేక బీజేపీ నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేకు టీఆర్ఎస్‌ టికెట్‌ నిరాకరిస్తే.. సునీత ఏం చేస్తారన్న ప్రశ్నలు నడుస్తున్నాయి. ఈ చర్చల మధ్యే ఆలేరు నీదా నాదా అన్నట్టుగా రాజకీయం వేడెక్కుతోంది.

Related Articles

Latest Articles