ప్రళయంలోనూ..వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు !

ఏపీలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ప్రళయంలోనూ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు కంటతడితో.. ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణల ఎపిసోడ్‌లో.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు రంగంలోకి దిగిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు.. వైసీపీ నేతల వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. రాజకీయాలతో సంబంధం లేని మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో తన కుటుంబాన్ని వైసీపీ నేతలు దూషించారంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతం కావడం తీవ్ర సంచలనం రేపింది. ఈ పరిణామం ఏపీలో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబుకు అండగా నందమూరి ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగింది.బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా కలిసి ప్రెస్‌ మీట్‌ పెట్టి.. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాలతో సంబంధం లేని ఓ మహిళలపై దూషణలకు దిగడం హేయమైన చర్య అన్నారు.

తమ కుటుంబం జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టమని వార్నింగ్‌ ఇచ్చారు. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల దొడ్డిలో ఉన్నమో అర్థం కావడం లేదన్నారు బాలకృష్ణ. ఏపీలో నీచ సంస్కృతికి తెరలేపారని విరుచుకుపడ్డారు.టీడీపీ, నందమూరి ఫ్యామిలీ ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరూ ఏమి అనలేదని.. రాజకీయాల కోసమే టీడీపీ అధినేత ఈ విషయాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. నందమూరి కుటుంబ సభ్యులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు మంత్రి పేర్నినాని. నందమూరి ఫ్యామిలీ ప్రెస్‌మీట్‌ పెట్టడాన్ని అటు లక్ష్మీ పార్వతీ కూడా తప్పుబట్టారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేసినప్పుడు వీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు.

Related Articles

Latest Articles