జమ్మలమడుగు ‘దేవగుడి’ కుటుంబంలో రాజకీయ క్రీడ..!

బాబాయ్ ఒక పార్టీలో ముఖ్య నేత. అబ్బాయి మరొక పార్టీలో యువనేత. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న ఆ కుటుంబంలో రాజకీయ క్రీడ మొదలైందా? ఇంతకు ఎవరా అబ్బాయ్.. ఎవరా బాబాయ్? లెట్స్‌ వాచ్‌..!

భూపేష్‌రెడ్డే రాజకీయ వారసుడిగా అప్పట్లో ఆదినారాయణరెడ్డి ప్రకటన..!

దేవగుడి కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుకునేలా కనిపిస్తోంది. ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా ఒక్కటిగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోనుందా? ఏ రాజకీయం అయితే వారిని కలిపిందో.. అదే రాజకీయం ఇప్పుడు విభేదాలు రాజేయబోతోందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2014లో వైసీపీ నుంచి ఆదినారాయణరెడ్డి వరసగా గెలిచి.. టీడీపీ కండువా కప్పుకొని ఏకంగా మంత్రి పదవి చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో తన రాజకీయ వారసుడు తన అన్న నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి అని ఆదినారాయణరెడ్డి బహిరంగంగా చెప్పేవారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్‌ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి దక్కడంతో ఆదినారాయణరెడ్డి కుటుంబానికి టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు.

భూపేష్‌రెడ్డి జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్‌..!
బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి రివర్స్‌ గేర్‌..!
భూపేష్‌రెడ్డి దగ్గరకు వెళ్లొద్దని అనుచరులకు మాజీ మంత్రి ఫోన్లు?

బాబాయ్‌ వెళ్లిపోవడం.. ఎలాగూ తననే వారసుడని గతంలోనే అనేకసార్లు ప్రకటించి ఉండటంతో భూపేష్‌ రంగంలోకి దిగారు. ఏ నాయకుడులేని టీడీపీని తన రాజకీయ ప్రస్థానానికి మార్గంగా ఎంచుకున్నారు. ఇదే సమయంలో భూపేష్‌రెడ్డిని జమ్మలమడుగు ఇంఛార్జ్‌గా టీడీపీ ప్రకటించింది.ఇక బీజేపీలో ఉన్నా ఎన్నికల నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అని అనుకున్నారో ఏమో భూపేష్‌ను టీడీపీ ఇంఛార్జ్‌ చేయడం ఆదినారాయణరెడ్డికి రుచించలేదు. అప్పటి వరకు భూపేషే వారసుడని ప్రకటించిన మాజీ మంత్రి రివర్స్‌ గేర్‌ వేయడం మొదలుపెట్టారు. మేం ఇద్దరం ఒకే పార్టీలో ఉంటేనే అతను నాకు వారసుడు అంటూ ఫిట్టింగ్‌ పెడుతున్నారట ఆది. అంటే తాను బీజేపీలో ఉన్నానని.. భుపేష్‌ టీడీపీలో ఉంటే తన వారసుడు ఎలా అవుతారని అంటున్నారట. అంతేకాదు..తన అనుచరులు.. ముఖ్యనేతలను భుపేష్‌రెడ్డి దగ్గరకు వెళ్లొద్దని, తిరగొద్దని ఆదినారాయణరెడ్డి ఫోన్లు చేసి మరీ చెబుతున్నారట.

నారాయణరెడ్డి కుటుంబం ఇప్పుడు కలిసే నిర్ణయం తీసుకుంటుందా?

దశాబ్దాలుగా నారాయణరెడ్డి సోదరులకు వెన్నుదన్నుగా ఉన్న కేడర్.. అనుచరులు దిక్కుతోచని స్థితిలో పడ్డారట. తాను చెప్పినట్టు వింటే నా రాజకీయ వారసుడుగా భూపేష్ ఉంటాడు. ఇప్పుడు నేనొక పార్టీ, భూపేష్ వేరే పార్టీ ఉన్నాం కాబట్టి అవన్నీ కుదరవు అని ఆదినారాయణ రెడ్డి బహిరంగానే చెబుతున్నట్టు సమాచారం. ఎన్నో సమస్యలు వచ్చిన కలిసి మెలిసి ఎదుర్కొన్న నారాయణరెడ్డి కుటుంబం ఇప్పుడు కూడా కలిసే నిర్ణయం తీసుకుంటుందా.. లేక ఈ మాటల వెనక మాజీ మంత్రి వ్యుహాత్మక ఆలోచనలు ఏమైనా ఉన్నాయా తెలియాలి. ఇన్నాళ్లూ రాజకీయంగా కలసికట్టుగా ఉన్న దేవగుడి సోదరుల మధ్య రానున్న రోజుల్లో పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో చూడాలి.

Related Articles

Latest Articles