ఉత్తరప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు?

త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమిఫైనల్ గా భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు తిరిగి తమ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా ఒక రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారాన్ని కాపాడుకోవడం ఆపార్టీకి కత్తి మీద సాములా మారింది. 

ఉత్తరప్రదేశ్ లో గతంలో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవానే కొనసాగింది. అత్యధిక పార్లమెంట్ స్థానాలతోపాటు అసెంబ్లీ సీట్లను దక్కించుకొని యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలినాళ్లలో ఆయన పాలనపై ప్రజల్లో సానుకూల పవనాలు వీచాయి. అయితే కొంతకాలంగా యూపీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. యూపీలో జరుగుతున్న వరుస సంఘటనలు బీజేపీ సర్కారు ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. 

ఈక్రమంలోనే బీజేపీ అధిష్టానం సీఎం యోగీని ఢిల్లీకి పిలిపించుకొని మరీ మాట్లాడింది. ఆయన మంత్రివర్గంలో మార్పులు చేయించింది. కేంద్ర మంత్రివర్గంలోనూ ఉత్తరప్రదేశ్ కు ఎక్కువ స్థానాలను కేటాయించింది. దీంతో పరిస్థితులన్నీ చక్కబడుతాయని అధిష్టానం భావించింది. అయితే ఇటీవల యూపీలో వరుసగా చోటు చేసుకుంటున్న అనుహ్య సంఘటనలు సర్కారును ఇరుకున పెడుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు క్రమంగా యూపీలో పుంజుకుంటున్నాయి. 
గతంలో దళితులు, మహిళలపై జరిగిన అమానుష ఘటనలు యోగీ సర్కారు మెడకు చుట్టుకున్నాయి. వీటి నుంచి బయటపడేందుకే ఆయన తంటాలు పడుతుండగా లిఖింపూర్ ఘటన చోటుచేసుకుంది. ఓ కేంద్ర మాజీ మంత్రి కుమారుడు రైతులపై కారు ఎక్కించడంతో నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన సంచలనం మారడంతో ప్రతిపక్షాలు రంగంలోకి దిగి బాధితుల పక్షాన పోరాడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, సమాజ్ వాది పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంచేసి విజయవంతం అయ్యారు. 


రైతులపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండించాల్సిన సీఎం యోగీ ఆదిత్య నాథ్ మిన్నకుండిపోయాడు. సకాలంలో స్పందించపోవడంతో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. విపక్షాలు ఈ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకొని సర్కారును ఇరుకున పెడుతూ పైచేయి సాధిస్తున్నాయి. దీంతో యూపీలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాగా ప్రతిపక్షాలు ఈసారి ఒంటరిగా బరిలో దిగుతున్నాయి. ఓటు బ్యాంకు చీలి మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. ఏదిఏమైనా లిఖింపూర్ సంఘటనతో యోగీ సర్కార్ ఇమేజ్ డ్యామేజ్ అయినట్లే కన్పిస్తుంది. ఈ వ్యతిరేకత నుంచి ఆయన ఎలా బయటపడుతారో వేచిచూడాల్సిందే..

-Advertisement-ఉత్తరప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు?

Related Articles

Latest Articles