రెంటికి చెడ్డ రేవడిలా మారిన కాంగ్రెస్?

త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అయితే ఆపార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ కు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అధిష్టానం ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుండటంతో నేతలంతా తలలు పట్టుకుంటున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ లో నాయకత్వ మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష పార్టీలు ఎస్సీ ఓటు బ్యాంకుపై కన్నేయడంతో ముందుగానే కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఈమేరకు అధిష్టానం ఏకంగా ముఖ్యమంత్రినే తప్పించింది. అమరీందర్ సింగ్ స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ ను ముఖ్యమంత్రిగా నియమించింది. ఇదంతా పైకి బాగానే ఉన్నట్లు కన్పించినా లోలోపల మాత్రం లుకలుకలు బయట పడుతున్నాయి.

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూను నియమించినప్పుడే ఆ పార్టీలో విబేధాలు ముదురుతాయని కాంగ్రెస్ భావించింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. పీసీసీ వైపు కొందరుంటే.. ముఖ్యమంత్రి వైపు కొందరు నిలిచారు. ప్రతిపక్షాలకు చెక్ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పాత సీఎంను తప్పించి కొత్త సీఎంగా చరణ్ జిత్ సింగ్ ను ప్రకటించింది. కానీ అమరీందర్ సింగ్ ను తప్పించిన విధానమే విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆయన వర్గం నేతలు అదును కోసం చూస్తున్నారు.

మరోవైపు సిద్ధూ తన పీసీసీ పదవీకి తాజాగా రాజీనామా చేయడం ఆపార్టీలో కలకలం రేపుతోంది. తనకు ఇష్టం లేకుండా డిప్యూటీ సీఎంగా సుఖజిందర్ సింగ్ రాధాను నియమించడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో ఆయన తన పదవీకి అడ్డువస్తారనే కారణంతో ముందుగానే సిద్ధూ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సిద్దూకు మద్దతుగా ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన కొద్దిగంటల్లో ఆపార్టీలో అసమ్మతి అంటుకోవడంతో అధిష్టానం డైలామాలో పడింది.

పాత సీఎంను తప్పించడమే కాకుండా పీసీసీ అధ్యక్షుడికి సైతం వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరువర్గాల నేతలు అధిష్టానంపై రగిలిపోతున్నారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి సామరస్యంగా సమస్యను పరిష్కరించాల్సిన అధిష్టానం కొత్త సమస్యలను సృష్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఆపార్టీ నేతలు పక్కచూపులు చూడాల్సి వస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో ఏరికోరి కష్టాలను కొని తెచ్చుకుంటోందన్న చర్చ సాగుతోంది.

అధిష్టానం నిర్ణయాలే ఆపార్టీకి శాపంగా మారుతున్నాయనే టాక్ విన్పిస్తోంది. ఇరువర్గాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఏం సాధించిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఆపార్టీ నిండా మునగడం ఖాయమంటున్నారు. బీజేపీ సైతం కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. దీంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

-Advertisement-రెంటికి చెడ్డ రేవడిలా మారిన కాంగ్రెస్?

Related Articles

Latest Articles