బెజవాడలో టీడీపీకి దిక్కెవరు..?

నవ్యాంధ్రలో తొలిసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా టీడీపీకి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏపీని ఐదేళ్లు పాలించారు. అయితే గతానికి భిన్నంగా చంద్రబాబు పాలన సాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడు. ఈ ప్రభావం గత ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. కిందటి ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమి పాలుకాగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీపై ఫోకస్ పెట్టారు. దసరా తర్వాత నుంచి ఆయన జిల్లాల పర్యటన చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఒక్కో జిల్లాలో మూడు, నాలుగురోజులపాటు సభలు, సమావేశాలు, సమీక్షలు చేయనున్నారు. పార్టీ సీనియర్లతో ప్రత్యేకంగా భేటి అయి పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నారు. ఇదే సమయంలో పార్టీని గాడిన పెట్టేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ప్రతిపక్ష పార్టీగా సైతం విఫలమవుతుందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కరోనా సాకుతో టీడీపీ అధినేత ఇంటికే పరిమితం అవుతున్నారని  ప్రజలు నిరాశ నెలకొంది. ఈ విమర్శలను సైతం తిప్పికొట్టేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. ఇకపై హైదరాబాద్లో కాకుండా విజయవాడ కేంద్రంగా ఆయన పార్టీని నడుపబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడను ఏపీ రాజధానిగా చంద్రబాబు మార్చివేశారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ బలోపేతం చేయాల్సిన ఆయన ఒకరిద్దరికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇతర నేతల్లో అసంతృప్తి గూడుకట్టుకొని పోయింది. అదనుకోసం చూసిన నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీనీ వీడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు తనకు సన్నిహితులైన దేవినేని ఉమ, కొల్లు రవీంద్రకు తన క్యాబినెట్లో చోటు కల్పించారు. అయితే ఉమ పార్టీ నేతలతో వ్యవహరిస్తున్న తీరుతో పలువురు నేతలు నాడే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన వాటిని పట్టించుకోలేదు. పైగా దేవినేని ఉమకే అధిక ప్రాధాన్యం ఇస్తూ వెళ్లారు.

ఉమ కారణంగానే బెజవాడలోని టీడీపీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ బలహీనంగా మారుతోంది. టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయాక వల్లభనేని వంశీ పార్టీనీ వీడుతూ ఉమ  కారణంగానే తాను పార్టీ మారానని చెప్పాడు. ఇక తాజాగా కేశనేని నాని సైతం ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోయేది లేదంటూ టీడీపీ అధినేతకు తేల్చిచెప్పాడు. దీనికి ప్రధాన కారణం ఉమనే అంటూ బాంబుపేల్చారు. చంద్రబాబు నాయుడు తన సన్నిహితుడైన దేవినేని ఉమను కంట్రోల్ చేయకపోవడంతోనే పార్టీలోని నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీనీ వీడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన కృష్ణాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ బలంగా ఉన్న సామాజిక వర్గం ఇప్పుడు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఆ సామాజికవర్గంపై ఉన్న కోపంతో ఇతర వర్గాలు సైతం టీడీపీని దూరంగా పెడుతున్నాయి. దీంతో కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. విజయవాడలో ఆధిపత్య పోరుతో టీడీపీ భ్రష్టుపట్టిపోతుందనే టాక్ విన్పిస్తోంది. వీటిన్నింటికీ  చంద్రబాబు గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

టీడీపీ ఓటమి తర్వాత బెజవాడ, కృష్ణా జిల్లాల్లోని టీడీపీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. వలసలు ఆపాల్సిన నేతలు మిన్నకుండి పోతుండటంతో పార్టీ పరిస్థితి రోజుకురోజుకు దిగజారిపోతోంది. ఇకనైనా చంద్రబాబు అందరినీ కలుపుకుపోతేనే పార్టీ మళ్లీ గాడినపడుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని అంటున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు పార్టీని ఎలా గాడిన పెడుతారనేది ఆసక్తికరంగా మారింది.

-Advertisement-బెజవాడలో టీడీపీకి దిక్కెవరు..?

Related Articles

Latest Articles