పోలీసుల రేవ్‌పార్టీ..! స్థానికుల సమాచారంతో రైడ్.. సీఐని సైడ్‌ చేసి..!

గుంటూరులో సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల వ్యవహారశైలిని బయటపెట్టింది. లక్ష్మీపురంలోని ఓ బిల్డింగ్‌ నుంచి… అరుపులు, కేకలు వినిపించడంతో… విసిగిపోయిన స్థానికులు… అక్కడికి వెళ్లి చూశాడు. రేవ్‌ పార్టీ జరుగుతుండడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడున్న పోలీస్ అధికారి… వారికి వార్నింగ్‌ ఇచ్చి పంపారు. ఇలా కాదనుకున్న స్థానికులు… ఆ బాగోతాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత.. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పాతిక మంది గుంపు తమ ఇంటి దగ్గర రేవ్ పార్టీ చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఎవరో అనుకుని వచ్చిన పోలీసులు… అక్కడున్న తమ అధికారిని చూసి షాకయ్యారు.

కొన్ని నెలల క్రితం పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లోనే పనిచేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆక్కడ ఉన్నారు. మద్యం సేవించి అమ్మాయిలతో చిందులు వేస్తూ… కిక్కులో మునిగి తేలుతున్నారు. అతన్ని గుర్తించిన పోలీసులు.. సీఐ వెంకటేశ్వర్లును పక్కకు తప్పించి… మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు మహిళలతో పాటు 20 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. 294 సెక్షన్ కింది కేసు నమోదు చేశారు. కానీ, ఏ సీఐ అయితే తమకు అండగా ఉంటానంటూ రేపు పార్టీ పెట్టించారో… ఇప్పుడు అదే సీఐని సైడ్ చేసేసి తమని కేసులో ఎలా ఇరికిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు రేవ్ పార్టీలో పాల్గొన్న కొంతమంది. సీఐని తప్పించడంపై లక్ష్మీపురం వాసులు కూడా మండిపడుతున్నారు. అసలు నిందితులను తప్పించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, రేవ్ పార్టీలో ఉన్న సీఐ వ్యవహారం మూడు వివాదాలు ఆరు ట్రాన్స్‌ఫర్లుగా కొనసాగుతోంది. గతంలో ఏసీబీలో పనిచేసిన సమయంలో వెంకటేశ్వర్లు అత్యంత వివాదాస్పద పేరు సంపాదించారు. అమాయకులను కేసులో ఇరికించారని, రిపోర్టులు రాసేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాంటి సీఐ వెంకటేశ్వర్లు ఇప్పుడు రేవ్ పార్టీ లో దొరికి… అది జస్ట్ బర్త్‌డే పార్టీ విత్ ఆర్కెస్ట్రా అంటూ బుకాయిస్తున్నారని సమాచారం.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-