‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ మన భూదాన్‌పోచంపల్లి..

తెలంగాణలోని భూదాన్‌ పోచంపల్లి విలేజ్‌ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది… రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది… ఇటీవలే రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ నుంచి పోటీపడిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం ఆ ఘనత సాధించింది.. భారత్‌ నుంచి భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని లద్‌పురాఖాస్‌ కూడా పోటీలో నిలవగా.. ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా పోచంపల్లిని ఎంపిక చేశారు.. ఇక, డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది…

ఇక, భూదాన్‌పోచంపల్లికి పేరుకు తగినట్టుగా చారిత్రక నేపథ్యం కూడా ఉంది.. భూదానోద్యమానికి అంకురార్పణ చేసి చరిత్ర సృష్టించింది ఈ గ్రామం.. చేనేత వస్త్రాలకు, చేనేత కళాకారుల కళా నైపుణ్యానికి పెట్టింది పేరు పోచంపల్లి.. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లిలో పర్యటించడం.. ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణతో చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందింది.. మరోవైపు.. పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉంది.. చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్‌సిటీగా పేరు తెచ్చుకుంది.

పోచంపల్లి చరిత్రపుట్టల్లోకి వెళ్తే.. నిజాం పాలన సమయంలోనూ నిజాం ప్రభువులు.. అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసేవారు.. ఇక, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారిపోయింది.. భూదానోద్యమ చారిత్రక గాథ, గ్రామీణ పర్యాటక కేంద్రం, చేనేత, చేతివృత్తులతో పాటు కుటీర పరిశ్రమలు మరోవైపు వ్యవసాయానికి నిలయంగా కొనసాగుతూ వస్తోంది… ఇంకోవైపు నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తున్న జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ రాష్ట్రంలోనే పేరు తెచ్చుకోవడం మరో విశేషంగా చెప్పుకోవాలి.. ఇప్పటికే భూదాన్‌ పోచంపల్లిని అగ్ర రాజ్యాలకు చెందిన టూరిస్టులను ఆకర్షించింది.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా.. ఇలా 100 దేశాలకు పైగా పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శించారు. ఇక, ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ గౌరవాన్ని దక్కించుకున్న ఈ గ్రామానికి మరింతగా పర్యాటకుల తాకిడీ పెరగనుంది అని అంచనా వేస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామాన్ని బెస్ట్‌ టూరిజం విలేజ్‌గా ఎంపిక చేయడంపై ఆ గ్రామ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles