బ్రిక్స్‌ దేశాల వార్షిక సదస్సు.. కీలక తీర్మానానికి ఆమోదం

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, మానవ హక్కుల రక్షణకు భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్య దేశాలు ఆమోదించాయి. ఆఫ్ఘనిస్థాన్‌ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని ఈ తీర్మానం ద్వారా నిర్ణయించారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల రవాణాకు, ఉగ్రవాదానికి ఆలవాలంగా ఉన్న ఆఫ్గనిస్తాన్ పొరుగు దేశాలకు ముప్పుగా పరిణమించవద్దని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు ప్రధాని మోడీ. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ది చెందుతున్న దేశాలకు బ్రిక్స్ ప్రభావవంతమైన గొంతుకగా మారిందన్నారు. ఆఫ్ఘన్‌ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో కొత్త సంక్షోభానికి తెరలేచిందని పుతిన్ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ సభ్య దేశాల్లాగే ఆఫ్ఘన్‌ గడ్డపై శాంతి, సుస్థిరత స్థాపనకు రష్యా నిరంతరం మాట్లాడుతూనే ఉందన్నారు. ఆఫ్ఘన్‌పై చైనా మట్లాడుకుండా దాటవేసింది. గడిచిన 15 ఏళ్లలో వ్యూహాత్మక కమ్యూనికేషన్, సమానత్వ స్పూర్తిని బ్రిక్స్ దేశాలు మరింత ముందుకు తీసుకెళ్లాయన్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాలు కీలక శక్తిగా ఎదిగాయన్నారు. ఇక వచ్చే ఏడాది జరిగే బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది.

Related Articles

Latest Articles

-Advertisement-