బైడెన్‌తో ప్రధాని మోడీ కీలక చర్చలు.. కొత్త శకం మొదలు..

భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీతో.. వైట్‌హౌజ్‌లో సమావేశమైన బైడెన్‌.. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. బైడెన్‌తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే బైడెన్‌తో మాట్లాడాననీ.. భారత్ పట్ల అప్పుడే ఆయన దృక్పథం అర్ధమైందనీ చెప్పారు.

ఇక, ఈ సమావేశానికి ముందు మీడియాతో బైడెన్ మాట్లాడుతూ ఇండియా-అమెరికా మధ్య ఉన్న సంబంధాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘమైన, బలమైన సంబంధాలు ఉన్నాయని, కొవిడ్ నుంచి ఇండో-పసిఫిక్ అంశాల వరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం విషయంలో మరోసారి ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియా లాంటి దేశానికి ఎప్పుడో శాశ్వత సభ్యత్వం రావాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని అందరూ ఒప్పుకుంటారు. కానీ, శాశ్వత సభ్యత్వం దక్కడానికి కావాల్సిన చొరవ మాత్రం ఎవరూ తీసుకోవడం లేదు. వీలైనంత త్వరగా భద్రతా మండలిలో సంస్కరణలకు చొరవ తీసుకోవాలని మోడీ.. బైడెన్ ను కోరినట్టు సమాచారం.. మరోవైపు.. బైడెన్ వచ్చిన తొలినాళ్లలోనే భారత్ లో అసహనం పెరిగిపోతోదంటూ అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన నివేదికపై దుమారం రేగింది. అయితే ఆ తర్వాత బైడెన్, మోడీ ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. పరస్పర అనుమానాల నుంచి ముందడుగు పడి.. వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై దృష్టి పెట్టేవరకూ వచ్చింది.

Related Articles

Latest Articles