గిఫ్ట్‌ ను అమ్ముకున్న పాక్ ప్రధాని..

ఆయన దేశంలోని క్రికెటర్లకు ఆరాధ్య దైవం. రిటైర్మంట్‌ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చి ప్రధాని అయ్యారు. క్రికెట్‌లోనే కాదు పాలిటిక్స్‌లోనూ లీడర్‌ని అని నిరూపించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పని.. అతడిని నవ్వులపాలు చేస్తోంది.

ఇమ్రాన్‌ ఖాన్‌.. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి. క్రికెటర్‌ నుంచి ప్రధానిగా ఎదిగిన లీడర్. పాకిస్థాన్‌లో ఎంతో ఖ్యాతి ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసిన పని.. ఇటీవల బయటపడింది. గిఫ్ట్‌గా వచ్చిన గడియారంను అమ్మి.. ఆ డబ్బులు నొక్కేశారని విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు ఇమ్రాన్‌ ఖాన్‌పై విమర్శల బౌన్సర్లు విసురుతున్నాయి. ప్రధాని లాంటి పదవిలో ఉండి.. ఇలాంటి పని చేయడం ఏంటని ఏకిపారేస్తున్నాయి.

ఇమ్రాన్ ఖాన్.. ఓ గల్ఫ్‌ దేశ యువరాజు ఇచ్చిన ఖరీదైన గడియారాన్ని విక్రయించి సుమారు రూ.7.4 కోట్లు జేబులో వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన తీరు సిగ్గుచేటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మామూలుగా ఒక దేశ ప్రధాని.. మరో దేశంలో పర్యటించినప్పుడు అధికారికంగా ఇచ్చిన ఖరీదైన బహుమతులను.. గిఫ్ట్ డిపాజిటరీలో భద్రపరుస్తారు. వీటన్నింటినీ ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు. సొంతంగా అమ్ముకోకూడదు. నిబంధనల ప్రకారం వాటిని బహిరంగ వేలంలో విక్రయిస్తారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ కక్కుర్తి పడి.. ఈ బహుమతులను అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అసలే పాకిస్థాన్‌ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. అత్యధిక విదేశీ అప్పులు కలిగిన టాప్ టెన్ దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరిందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఖజానాకు చిల్లుపెట్టే పనుల్ని ఇమ్రాన్‌ ఖాన్‌ చేయడంపై దుమారం రేగుతోంది. ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇదేం పాడుబుద్ధి అని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే పాకిస్తాన్‌ పరువును.. ఇమ్రాన్‌ పూర్తిగా తీసేస్తున్నాడని సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Related Articles

Latest Articles