టీటీడీ పాలకమండలిపై విమర్శల వెల్లువ : హైకోర్టులో పిల్

టీటీడీ బోర్డుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు గళం ఎత్తగా….బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు హైకోర్టులో టీటీడీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపి ప్రభుత్వం నియమించిన జంబో టీటీడీ పాలకమండలి వ్యవహారంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. 81 మందితో పాలకమండలి ఏర్పాటును వివిధ రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి లేఖరాశారు. 50 మందికి ఎక్స్ ఆఫిషియోగా అవకాశం ఇచ్చి బోర్డులో పెట్టడాన్ని తప్పుబట్టారు. ఇతర రాజకీయ పక్షాలు కూడా దీనిపై గళమెత్తాయి.

బీజేపీ మరో అడుగు ముందుకేసి గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. నేరస్తులకు అవకాశం ఇవ్వడం ద్వారా పవిత్రత దెబ్బ తింటుందని సోము వీర్రాజు వ్యాఖ్యనించారు. సామాన్య భక్తులకు ఈ బోర్డు వల్ల ఇబ్బందులు వస్తాయని అభిప్రాయపడ్డారు. టీటీడీపై అభ్యంతరాలతో హైకోర్ట్ లో పిల్ నమోదైంది. దీనిపై ఇవాళ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కళ్యాణదుర్గంకు చెందిన టిడిపి నేత ఉమా మహేశ్వర నాయుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎండోమెంట్ యాక్ట్ కు విరుద్దంగా బోర్డు ఉందని పిల్ లో పేర్కొన్నారు. ఇప్పటికే పిల్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అటు రాజకీయ పక్షాలను కానీ ఇటు వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలను కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇప్పుడు కోర్టు కేసుతో ఎలాంటి తీర్పు వస్తుందోనని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

-Advertisement-టీటీడీ పాలకమండలిపై విమర్శల వెల్లువ : హైకోర్టులో పిల్

Related Articles

Latest Articles