పంది గుండెతో మొదటి ప్రయోగం మనవాడిదే… కానీ!

గత వారం అమెరికా వైద్యులు తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన పంది గుండెను విజయవంతంగా మనిషికి అమర్చారు. సర్జరీ అయిన పేషెంట్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలో అతడు పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు నమ్ముతున్నారు. మరోవైపు, అవయవ మార్పిడిపై జరుగుతున్న ప్రయోగాలలో ఈ సర్జరీ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వైద్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గత కొన్ని దశాబ్దాలలో జరిగిన సాంకేతిక అభివృద్ధి ఫలితంగా వైద్య రంగం ఎంతో ముందుకు వెళ్లింది. అనేక వైద్య సదుపాయాలు నేడు మనిషి అందుబాటులో ఉన్నాయి. దాతల అవయవాలను గ్రహీతలకు అమర్చి ప్రాణం పోస్తున్నారు. ఐతే, గ్రహీతల సంఖ్యలో దాతలు లేకపోవటం వల్ల అవయవ కొరత ఏర్పడింది. దాంతో ఇతర జాతుల శరీర అవయవాలపై ప్రయోగాలు ముమ్మరమయ్యాయి. మరణం మినహా మరో మార్గం లేని రోగులపై ఈ ప్రయోగాలు జరిగాయి. తాజాగా పంది గుండెను మనిషికి అమర్చిన ప్రయోగం కూడా అలాంటిదే.

అమెరికా వైద్యుల ప్రయోగం విజయవంతం కావటం అవయవ సంక్షోభాన్ని తీర్చటంలో ముందడుగు. అవయవాలు అందుబాటులో లేక నిత్యం లక్షలాది మంది చనిపోతున్నారు. అమెరికాలో ప్రత రోజు సగటున పదిహేడు మంది ప్రాణాలు విడుస్తున్నారు. లక్షలాది మంది అవయవాల కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇంత మందికి అవయవాలు అందటం అసాధ్యం. కాబట్టి, జంతు అవయవాలపై సీరియస్‌గా ప్రయోగాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇతర జాతుల అవయవాలను మనుషులకు అమర్చే ప్రక్రియను జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. అలాంటి ఒక ప్రయోగం గత ఏడాది అమెరికాలో జరిగింది. న్యూయార్క్‌ శస్ర్తచికిత్స నిపుణులు పంది కిడ్నీని మనిషికి మార్చారు. ఐతే, సర్జరీకి ముందే పేషెంట్‌ బ్రెయిన్‌డెడ్‌తో అపస్మారక స్థితికి వెళ్లారు. కోలుకునే అవకాశాలు లేవని నిర్ధారణ అయ్యాకే ప్రయోగాత్మక శస్ర్త చికిత్సకు పూనుకున్నారు. కానీ ఇప్పుడు పంది గుండె అమర్చిన వ్యక్తి సర్జరీ తరువాత సాధారణ జీవితాన్ని ఆశిస్తున్నాడు. సర్జరీ విజయవంతం అయింది..కానీ ఆయన ఎంత కాలం జీవిస్తాడో ఎవరూ చెప్పలేరు.

ఇతర జాతుల అవయవాలను మనుషులకు అమర్చటానికి ముందు వాటి జన్యువులను అవసరమన విధంగా సవరించాల్సి వుంటుంది. జంతు అవయవాలను మానవ శరీరం తిరస్కరించటానికి కారణమయ్యే కొన్ని జన్యువులను వాటి నుంచి తొలగించాలి.

నిజానికి, జీనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియ ఇప్పటిది కాదు. చాలా కాలంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. గతంలో మనిషి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీల కోస శాస్త్రవేత్తలు మనిషికి దగ్గరగా ఉండే వానర జాతులపై దృష్టి పెట్టారు. కొన్ని ప్రయోగాలు విజయవంతం అయ్యాయి కూడా.

మనిషికి పంది గుండెను విజయవంతంగా సాధారణ విషయం కాదు. ఐతే, పాతికేళ్ల క్రితమే భారతీయ వైద్యుడు ఆ పని చేశాడు. అస్సాంకు చెందిన డాక్టర్ ధని రామ్‌ బారువా 1997లో 32 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను విజయవంతంగా అమర్చాడు. ఐతే, ఈ క్రమంలో జరిగిన చట్టపరమైన పొరపాట్లతో ఆ ఘనత బారువాకు దక్కలేదు. అస్సాంలోని సోనాపూర్‌కు చెందిన డాక్టర్ ధనిరామ్‌ బారువాకు ప్రస్తుతం 72 ఏళ్లు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగా స్పష్టంగా మాట్లడలేరు. కానీ సహాయకులకు ఆయన ఏం చెపుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది.

అస్సాం రాజధాని గువాహటికి 20 కిలోమీటర్ల దూరంలోని సోనాపూర్‌లో ఆయన అప్పట్లో ‘ధనిరామ్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లైడ్‌ హ్యూమన్‌ జెనెటిక్‌ ఇంజనీరింగ్‌’ వైద్య కళాశాలను నడిపేవారు. 80వ దశకంలోనే ఆయన ప్రపంచ స్థాయి కార్డియాలజిస్ట్‌. ఆ రోజుల్లోనే కృత్రిమ హృదయ కవాటాలను అభివృద్ధి చేసిన గొప్ప వైద్య నిపుణుడు ఆయన. ఆ “బారువా హార్ట్‌ వాల్వ్‌” లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అలాగే, గుండెకు సంబంధించి అనేక ప్రయోగాలు చేశారాయన. కానీ, 1997లో పంది గుండెపై చేసిన ఎక్స్‌పర్మెంట్‌తో కథ మొత్తం మారిపోయింది.

డాక్టర్ బారువా 1997 జనవరిలో హాంగ్‌కాంగ్‌కు చెందిన జోనాథన్‌ హోకీ షింగ్‌ అనే హార్ట్‌ సర్జన్‌తో కలిసి ఈ ప్రయోగం చేశారు. ఇప్పుడున్నంతగా వైద్య వసతుల్లేని ఆ కాలంలో, అదీ తన వైద్య కళాశాల లోనే ధనిరామ్‌ ఈ సర్జరీ చేయడం విశేషం. పంది గుండెతో వారం రోజుల పాటు బతికిన ఆ పేషెంట్‌.. పలు రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా వారం రోజుల తర్వాత చనిపోయాడు.

ప్రపంచస్థాయి హార్ట్‌ సర్జన్‌ అయిన ధని రామ్‌ ‘జెనో ట్రాన్స్‌ప్లాంటేషన్‌’కు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు. అంతే కాదు.. తన పరిశోధనల వివరాలను ఉన్నతస్థాయి సమీక్షలకు పంపకుండానే, నేరుగా పంది గుండె అమర్చే సర్జరీ చేశారు. దీంతో ఆయనపై, ఆస్పత్రిపై కేసులు నమోదయ్యాయి. 40రోజులు జైల్లో ఉన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో చాలా కాలం పాటు ఆయన ఇంటికే పరిమితమయ్యారు.

ఆస్పత్రి దెబ్బతిన్నా, ఆరోపణలు వచ్చినా డాక్టర్‌ ధనిరామ్‌ పరిశోధనలు ఆపలేదు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను సరిచేసే జన్యు మార్పిడి వ్యాక్సిన్‌ను రూపొందించినట్టు 2008లోప్రకటించారు. హిమాలయాల్లోని ఔషధ మొక్కల నుంచి హెచ్‌ఐవీని నియం త్రించే జన్యువు లను సేకరించామని..86మందిలో హెచ్‌ఐవీని నిర్మూలించగలిగామని 2015లో ప్రకటించారు.

డాక్టర్‌ బారువా ఎక్స్‌పర్మెంట్‌ సక్సెస్‌ అయివుండవచ్చు. కానీ శస్త్ర ప్రక్రియ ఇక్కడ ముఖ్యం. బారువా ప్రయోగం అనైతికమైనది. కానీ, యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్‌ సర్జన్ల విజయం దశాబ్దాల వారి పరిశోధనల ఫలితం. కాబట్టే వైద్యశాస్త్రంలో అది ఓ మైలురాయిగా ప్రశంసలు అందుకుంటోంది.

మరొక ముఖ్యమైన తేడా ఏమిటంటే జన్యు మార్పిడి చేసిన పంది గుండెను అమెరికా సర్జన్లు ఉపయోగించారు. లక్ష పంది జన్యువులలో పదింటిని మానవ గుండెకు సరిపోయే విధంగా సవరించారు. మనిషి శరీరం పంది అవయవాలను వేగంగా యాంటీబాడీ-మీడియేటెడ్‌ తిరస్కరణకు కారణమయ్యే మూడు జన్యువులను అందులో నుంచి తొలగించారు. అలాగే పంది గుండె రోగనిరోధకశక్తిని ఒప్పుకునే ఆరు మానవ జన్యువులను జత చేశారు. వీటితో పాటు పంది హృదయ కణజాలం అధిక పెరుగుదల నిరోధానికి ఒక అదనపు జన్యువును కూడా తొలగించారు. కానీ, బారువా సర్జరీకి సాధారణ సీమ పందులను వినియోగించారు.

ఇలాంటి ప్రయోగాత్మక శస్త్ర చికిత్సలకు సంబంధిత విభాగాల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ ముందస్తు అనుమతి తీసుకుంది. కానీ బారువా తన శస్త్రచికిత్సను రహస్య పద్ధతిలో నిర్వహించారు. ఎవరినీ అనుమతించని ఏకాంత ప్రదేశంలో సర్జరీ నిర్వహించారు. వారు చేసేది ప్రపంచానికి ఉపయోగపడుతుందని బావిస్తే ముందస్తుగా ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదనే ప్రశ్న వస్తుంది.

అమెరికా వైద్యులు పంది గుండె అమర్చిన రోగి 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుంటున్నాడు. ఐతే, అతను ప్రమాదం నుండి బయటపడ్డాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని గుండె మార్పిడి బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ అంటున్నారు. బెన్నెట్‌ శరీరంలో రక్త ప్రసరణ కోసం అమర్చిన యంత్రం 45 రోజులకు మించి అవసరం ఉండదని అంటున్నారు.

బెన్నెట్‌ ప్రస్తుతం సొంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మెల్గగా మాట్లాడుతున్నారు కూడా. పంది గుండె కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఆయనకు మరో వారం పాటు యంత్ర సాయం అవసరం ఉంటుంది. మొత్తానికి బెన్నెట్‌ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతను ఎంత కాలం జీవిస్తాడనే దానిపైనే ఈ ప్రయోగాల భవిత్యం ఆధారపడి ఉంది. బెన్నెట్‌ సుదీర్ఘకాల్ బతికితే నిజంగానే ఇది వైద్యశాస్త్రాన్ని మలుపు తిప్పిన ఘట్టంగా మానవ చరిత్రలో మిగిలిపోతుంది!!

Related Articles

Latest Articles