త్వరలోనే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజీల్?

బీజేపీ సర్కారు వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి ఐదేళ్లలో కమలదళం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో మోదీ ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో మోదీ సర్కారు రెండోసారి సైతం అధికారంలోకి వచ్చింది. అయితే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక మోదీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతూ వస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. జనాల రద్దీ తగ్గిపోవడంతో వాహనాలన్నీ ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. అన్ని దేశాల్లోనూ క్రమంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గముఖం పట్టాయి.

భారత్ లో మాత్రం పెట్రో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీని ప్రభావం అన్ని రంగాలపై చూపడంతో మోదీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయింది. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినందుకే నాడు మోదీ యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఆయన హయాంలోనే పెట్రోల్ ధరలు వందకు పైగా చేరడం శరాఘాతంగా మారింది. దీంతో మోదీ పాలనపై ప్రతిపక్షాలతోపాటు సామాన్యుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయంగా క్రూడాయిల్ బ్యారల్ ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇండియాలోనూ ఇదే విధానం కొనసాగుతోంది. అయితే క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గినా ఇండియాలో మాత్రం అమలవడం లేదు. క్రూడాయిల్ తో ఎలాంటి సంబంధం లేకుండానే వీటి ధరలను ప్రభుత్వం ఇష్టారీతిన పెంచుకుంటూ పోతుంది. క్రుడాయిల్ ధరలు పెరిగినప్పుడు పన్నులు పెంచిన ప్రభుత్వం తగ్గినప్పుడు కూడా ధరలు పెంచడం ఏంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. యూపీఏ హయాంలో పెట్రోలు ధర గరిష్టంగా 60 రూపాయలు ఉంటే ఇప్పుడు ఆ రేటు సెంచరీని దాటింది.

ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని మోదీ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వ్యతిరేకత వచ్చిన అంశాలపై ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర ధరలు కూడా పెరిగాయి. ఈ ప్రభావం మోదీ సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల కట్టడికి మోదీ సర్కారు నడుం బిగిస్తోంది. ఈ నెల 17న జరిగే జీఎస్టీ మండలి భేటీలో ఈ విషయాన్ని చర్చించి కీలక నిర్ణయం ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రం నిజంగానే పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేస్తే ఖచ్చితంగా ధరలు అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం పెట్రోల్ పై లీటర్ కు కేంద్రం పన్ను రూ. 32.80 ఉండగా డీజిల్ పై రూ.31.80గా ఉంది. కేంద్రం పన్నులకు అదనంగా రాష్ట్రాలు వ్యాట్ విధిస్తున్నాయి. దీంతో అన్ని కలిసి లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. ఇక త్వరలో జరుగబోయే జీఎస్టీ మండలి భేటిలో కేంద్రం పెట్రోల్, డిజీల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయాన్ని చర్చించనుంది. పెట్రో ఉత్పతులను కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.50 నుంచి 60 మధ్యకు దిగేవచ్చే అవకాశం ఉంది. ఇది సామాన్యులకు బిగ్ రిలీఫ్ కానుంది.

త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటుందనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా వాహనదారులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా మోదీ సర్కారు పెట్రోల్, డిజీల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!

Related Articles

Latest Articles

-Advertisement-