పెందుర్తి టికెట్‌ కోసం టీడీపీలో ఫైట్‌..!

ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే. పదవి తెచ్చిన వన్నెకంటే కాంట్రవర్సీతో వచ్చిన గుర్తింపే ఎక్కువ. అలాంటి నాయకుడిని ఓ మాజీ మంత్రితో జతకట్టించింది అధిష్ఠానం. కలిసి కాపురమైతే చేశారు కానీ ఎవరి కుంపట్లు వారివే. ఇప్పుడు ఆ ఇద్దరూ టికెట్ నాదంటే నాదని పోటీ పడుతున్నారట. ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని గుర్తించిన హైకమాండ్ మధ్యేమార్గం నిర్ధేశించిందని టాక్. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కాంట్రవర్సీ?

పెందుర్తి టికెట్‌ కోసం కోల్డ్‌వార్‌..!

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీల మధ్య విశాఖ జిల్లా పెందుర్తి టికెట్‌ ఫైట్‌ జరుగుతోంది. ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో ఉండాలని గండిబాబ్జీ గట్టి పట్టుదలతో ఉన్నారట. టీడీపీ అభ్యర్థి బాబ్జీనే అని సోషల్‌ మీడియాలో ఊదరగొడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ పీక్‌కు వెళ్లినట్టు సమాచారం. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య పోరు పెరగడంతో టీడీపీ హైకమాండ్‌ అలెర్ట్‌ అయినట్టు తెలుస్తోంది. సయోధ్యకు పెద్ద కసరత్తే చేసినట్టు సమాచారం. అనేక లెక్కలు.. వడపోతల తర్వాత గండి బాబ్జీకి టీడీపీ ప్రత్యామ్నాయం చూపించనుందనే ప్రచారం జరుగుతోంది.

కొణతాల శిష్యుడిగా గండి బాబ్జీ పొలిటికల్ ఎంట్రీ..!

బండారు సత్యనారాయణమూర్తి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ శిష్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు గండి బాబ్జీ. 2004లో పరవాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో బండారుకు ప్రత్యర్థిగా ఉన్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో పరవాడ రద్దయ్యి పెందుర్తిలో కలిసింది. తర్వాత అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. కొణతాలతో కలిసి వైసీపీలో చేరారు బాబ్జి. 2014లో పోటీ చేసినా టీడీపీ చేతిలో ఓటమి తప్పలేదు. రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్నా.. ప్రజల్లో బలం తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. నాయక్ సినిమాలో విలన్‌పేరు గండి బాబ్జీ అని పెట్టడంతో.. తనను అవమానించారని హడావిడి చేసి మైలేజ్ సంపాదించారు. ఆ తర్వాత వైసీపీ నాయకత్వాన్ని విమర్శించి ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరారు బాబ్జీ.

గండి బాబ్జీ చేరికను వ్యతిరేకించిన బండారు..!

టీడీపీలో గండి బాబ్జీ చేరికను బహిరంగంగానే వ్యతిరేకించారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని హైకమాండ్‌కు చెప్పారు. ఎన్నికల ముందు ఎవరినీ దూరం చేసుకునే పరిస్థితులు లేకపోవడంతో అధిష్ఠానం మాటకు కట్టుబడ్డారు బండారు. ఇప్పుడు ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉందనగా పెందుర్తిలో పంచాయితీ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి సీట్లు, ఓట్లు పెరిగాయి. ఈ విషయంలో తనదే కీలకపాత్రగా చెబుతున్నారు గండి బాబ్జీ. అందుకే టికెట్‌ తనకు ఇవ్వాలని కోరుతూనే.. అనుచరులతో ప్రచారం కూడా చేపట్టేశారు.

మాడుగల వెళ్లేందుకు బండారు ససేమిరా..!
విశాఖ దక్షిణ టీడీపీ ఇంఛార్జ్‌గా గండి బాబ్జి?

ఈ వ్యవహారం ముదరక ముందే క్లారిటీ ఇవ్వాలని హైకమాండ్‌ను కోరారట బండారు సత్యనారాయణమూర్తి. గండి, బండారు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో పార్టీ పెద్దలు సత్యనారాయణ మూర్తిని కన్విన్స్‌ చేసి.. మాడుగల నియోజకవర్గానికి పంపించాలని చూశారట. రాజకీయంగా వర్గం, బంధువులు, సన్నిహితులు ఉన్న తనను మార్చాలని ఆలోచన చేస్తే.. అసలు టికెట్టే వద్దదని.. పార్టీలో కార్యకర్తగా ఉండిపోతానని తెగేసి చెప్పారట బండారు. దీంతో బాబ్జీని ఒప్పించేందుకు రెండు మూడు నియోజకవర్గాలను ప్రస్తావించి.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పమని అడిగిందట టీడీపీ అధిష్ఠానం. ఈ సర్దుబాటులో భాగంగానే బాబ్జిని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా నియమిస్తున్నట్టు టాక్‌.

సామాజిక సమీకరణాలతో వెనకాముందు ఆడుతోన్న బాబ్జీ..!

టీడీపీ అధిష్ఠానం త్వరలోనే ప్రకటన జారీ చేస్తుందని గండి బాబ్జి వర్గీయులు చెబుతున్నారట. అదే సమయంలో దక్షిణ నియోజకవర్గంలో ఎంత వరకు నెగ్గుకు రాగలమో అనే మీమాంస వారిలో కనిపిస్తోంది. మత్స్యకారులు, కాపులు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు విశాఖ సౌత్‌లో ఎక్కువ. మత్స్యకారులదే ఎక్కువ హవా. వాసుపల్లి గణేష్‌ టీడీపీ నుంచి రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి.. వైసీపీ పంచన చేరిపోయారు. అయినప్పటికీ టీడీపీ గట్టిగానే ఉందని లెక్కలేసుకుంటోన్న గండి బాబ్జీ.. సామాజిక సమీకరణాల విషయంలో కాస్త ముందు వెనక ఆడుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ వెలమ సామాజికవర్గం ఓటింగ్ తక్కువ. ఇలాంటి సమయంలో విశాఖ సౌత్‌కు టీడీపీ ఇంఛార్జ్‌గా ప్రకటిస్తే ముందుకెళ్లడం ఎలా? ఏం చేద్దాం అని బాబ్జీ బృందం మల్లగుల్లాలు పడుతోందట. మరి.. పెందుర్తి పంచాయితీకి టీడీపీ ఎలా చెక్‌ పెడుతుందో చూడాలి.

Related Articles

Latest Articles