పొలిటికల్ రూట్ మ్యాప్ గా పవన్ రీ-ఎంట్రీ మూవీస్!

జనసేన అధినేతగా ఇకపై సినిమాలలో నటించనని చెప్పిన పవన్ కళ్యాణ్… అభిమానుల కోసం, ఆర్థిక వెసులబాటు కోసం యూటర్న్ తీసుకున్నారు. రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ను అధికారికంగా ప్రకటించడానికి మీనమేషాలు లెక్కించిన పవన్ ఒకసారి… అది రివీల్ అయిన తర్వాత ఇక మొహమాటపడకుండా వరుసగా సినిమాలు చేయడం మొదలెట్టేశారు. అయితే… ఈ రీ-ఎంట్రీ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలు, వాటి కథా కమామీషులను గమనిస్తే… ఇవన్నీ పవన్ పొలిటికల్ రూట్ మ్యాప్ కు అనుగుణంగా తెరకెక్కుతున్నాయేమో అనిపిస్తోంది.

‘వకీల్ సాబ్’ సినిమానే తీసుకుంటే, దాని మాతృక ‘పింక్’లో ఓ నిస్సహాయ ముసలి లాయర్, ముగ్గురు అమ్మాయిలకు బాసటగా నిలిచి, సమాజంలో మహిళల పట్ల ఉన్న దురభిప్రాయాలను పోగొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ‘వకీల్ సాబ్’ విషయానికి వచ్చేసరికీ ఇక్కడ పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని వీరోచితమైన యంగ్ అండ్ డైనమిక్ లాయర్ గా అతన్ని చూపించారు. బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడుతూ, భార్యను సైతం కోల్పోయిన వ్యక్తిగా తెరపై ప్రెజెంట్ చేశారు. అవసరమైతే తన ప్రాణాలను సైతం మహిళల కోసం పణంగా పెడతాడన్నట్టుగా ఆ క్యారెక్టర్ ను ఎలివేట్ చేశారు. ఫైనల్ గా ఇటు జనసైనికులకు, అటు తనను అభిమానించే వారికి పవన్ పొలిటికల్ ఎజెండా ఏమిటో చెప్పే ప్రయత్నాన్ని ‘వకీల్ సాబ్’ ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేశారు.

ఇక వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘భీమ్లా నాయక్’ సైతం అదే బాటలో సాగబోతోంది. ఎలా అంటే… ఇది మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్. ఓ గిరిజన పోలీస్ అధికారికి, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కు మధ్య జరిగే ఇగో క్లాష్ ప్రధానాంశంగా ఈ సినిమాను అక్కడ తెరకెక్కించారు. కానీ తెలుగులోకి వచ్చే సరికీ గిరిజన తండాకు చెందిన ఓ రఫ్ అండ్ టఫ్ పోలీస్ కథగానే దీనిని ప్రెజెంట్ చేస్తున్నారనిపిస్తోంది. రానా పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ఇప్పటికైతే తెలియదు. కానీ సమాజంలోని అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తిగా పవన్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మరో విశేషం ఏమంటే… హక్కుల నేతగా ప్రాణాలను పణంగా పెట్టే ఓ యువతిని పవన్ వివాహం చేసుకుంటాడు. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిస్టమ్ కారణంగా ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఇబ్బందులు పడతాడో కూడా ఇందులో చూపించబోతున్నారు. ఆ రకంగా ఇటు పవన్, అతన్ని సపోర్ట్ చేసి భార్య… రెండు పాత్రలూ చాలా చైతన్యవంతమైనవే. ఈ పాత్రల ద్వారా పవన్ తన పొలిటికల్ ఐడియాలజీని తెలియచేసే ఆస్కారం ఉంది. పైగా ఈ సినిమాకు ఆయన సన్నిహిత మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాస్తుండటం మరో ప్లస్ పాయింట్.

పవన్ కళ్యాణ్‌ రీఎంట్రీ లో మూడో చిత్రంగా వచ్చే యేడాది ఏప్రిల్ లో రాబోతున్న ‘హరిహర వీరమల్లు’ కూడా సామాజికాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్నదే. విదేశీయులకు వ్యతిరేకంగా ఓ స్వదేశీయుడు చేసే పోరాటం నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం. రత్నం సోదరుడు దయాకర రావు దీన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్ వేసి, దాదాపు యాభై శాతం షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు. స్వదేశీ స్వాభిమానాన్ని పెంపొందించే పాత్రలో పవన్ కనిపించడం ఈ సినిమా విశేషం. సో… దీని ద్వారానూ తన అభిమానులను, ప్రజలను పవన్ ఉత్తేజపరిచే ఆస్కారం ఉంది. పైగా క్రిష్ కు ఇలాంటి కథలను తెరకెక్కించడంలో మంచి అనుభవమే ఉంది. అది పవన్ కళ్యాణ్‌ కు ఉపయోగపడుతుంది.

ఇప్పుడు తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్‌ రీ-ఎంట్రీ నాలుగో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ టైటిల్ ను బట్టే ఇది ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గతంలో కాస్తంత తిక్క ఉన్న పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ కళ్యాణ్ ను సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసిన హరీశ్ శంకర్ ‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు’ అంటూ ఈ సినిమాలో ఏం ఉండబోతోందో కాప్షన్ రూపంలో చెప్పకనే చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ దేశ రాజధానిలోని ఢిల్లీ గేట్ ఎదురుగా హార్లీ డేవిడ్ సన్ బండిపై తాపీగా చాయ్ తాగుతున్న దృశ్యం చూస్తుంటే… ఇది కూడా పొలిటికల్ రూట్ మ్యాప్ ను అనుసరిస్తూ సాగే చిత్రమని తెలిసిపోతోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్‌ మనసెరిగి మన దర్శక నిర్మాతలు అతని ఇమేజ్ ను జనంలో పెంచే క్రమంలోనే సినిమాలను తీస్తున్నారు. అయితే… అవి ఏ మేరకు కమర్షియల్ హిట్స్ గా నిలుస్తాయి, ఆ పైన ప్రజలను ప్రభావితం చేసి ఓట్లుగా మారుస్తాయి అనేది వేచి చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-