‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ : ఏ ఒక్కరిని వదలక ఏకిపారేసిన పవన్

ఓ అభయారణ్యంలో తమకు ఎదురేలేదని వికటాట్టహాసంతో చెలరేగిపోతున్న హైనాల గుంపుపై పులి వచ్చి పంజా విసిరితే ఎలా ఉంటుందో ‘రిపబ్లిక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన మాటల దాడి చూస్తే అలానే అనిపించింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక కాస్త రాజకీయ సభగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తనలోని ఆవేదనను, ఆగ్రహాన్ని అంతా కక్కేశారు. సుధీర్ఘ ప్రసంగంతో సినిమాపై కంటే బయట విషయాలపైనే చీల్చిచెండాడేశాడు. పవన్ పంచ్ డైలాగులకు ఇండస్ట్రీలోని పెద్దల గుండెల్లో నిజంగానే రైళ్లు పరిగెత్తించినట్టుగా అయిపోయింది. పవన్ ప్రసంగంతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. అదే సమయంలో ప్రత్యర్థులను బట్టలిప్పి బజారున నిలబెట్టేలా వ్యాఖ్యానించాడు.

‘సాయితేజ్’ ప్రమాదంపై మీడియా చేసిన అతి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. కేవలం తన వల్ల సినీ పరిశ్రమను టార్గెట్ చేసి విధానం.. ఏపీలో జగన్ సర్కార్ తప్పిదాలను ఈ ఒక్క సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చీల్చిచెండాడేశాడు.. ఒక్కో మాట తూటాల పేలింది.

ప్రత్యర్థుల విమర్శలు, వ్యవహరిస్తున్న తీరును సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ ఏకిపారేశాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టికెట్ రేట్లు, ప్రభుత్వ జోక్యం, థియేటర్ల వ్యవస్థపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పవన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రుల తీరును దుమ్మెత్తిపోశారు. ఏపీ సర్కార్ ను వేడుకుంటున్న టాలీవుడ్ పెద్దలను, ఆఖరుకు అన్నయ్య చిరంజీవి తీరును పవన్ తప్పుపట్టారు. నిగ్గదీసి అడిగి మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చాడు.

ముందుగా తనపై కోపంతో టాలీవుడ్ ను ఇబ్బంది పెడుతున్నారని ఏపీ సర్కార్ పై పవన్ విమర్శలు గుప్పించారు. ‘నా పేరు చెప్పి సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారు. ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనమేంటి? చిత్రపరిశ్రమపై కన్నెత్తి చూస్తే వైసీపీ నేతలు కాలిపోతారు. సినిమా పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని’ హెచ్చరికలు జారీ చేశారు.

ఇక సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైతే దాన్ని రాద్ధాంతం చేసిన మీడియా తీరును తీవ్రంగా విమర్శించారు పవన్ కళ్యాణ్.. ‘సాయితేజ్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది? నిర్లక్ష్యం నడిపాడు.. ఎలా పడిపోయాడు? ఎంత స్పీడు అంటూ కొన్ని మీడియా సంస్థలు లేనిపోని కథనాలు అల్లారని పవన్ దునుమాడారు. సమాజంలో చాలా సమస్యలున్నాయి. వాటి మీద మాట్లాడండి మీడియా బాధ్యాతాయుతమైన కథనాలు ఇవ్వాలని పవన్ హితబోధ చేశారు.

ఈ క్రమంలోనే ‘వైఎస్ వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు? కోడికత్తి తో ఒక నాయకుడిని పొడవడం వెనుక భారీ కుట్ర ఉంది. ఆరేళ్ల చిన్నారిపై అమానుషం మీద కథనాలు ఇవ్వండి.. మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింసపై మాట్లాడాలి.. మా సినిమా వాళ్లు ఏం మాట్లాడరు.. వాళ్లకు నోరు లేదు.. కౌంటర్ ఇవ్వరనే మీ మీడియా అతి చేస్తోందా?’ అంటూ పవన్ మీడియాపై చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి.

మొత్తంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రధానంగా టాలీవుడ్ ను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. అదే సమయంలో సాయితేజ్ విషయంలో కథనాలు అల్లిన మీడియాను ఏకిపారేశాడు. సమాజంలో మీడియా తీరు ఎలా ఉండాలో వివరించాడు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని అడుక్కోకూడదని.. నిలదీయాలంటూ తన సొంత అన్నయ్య చిరంజీవిని ప్రస్తావించి సినీ పెద్దల తీరుపై విమర్శలు గుప్పించారు. పవన్ ప్రసంగంలో ఆవేదన, ఆగ్రహం, ఒక విప్లవ వ్యాఖ్యానం కనిపించింది. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. మరీ దీనిపై ప్రత్యర్థుల స్పందన ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.

-Advertisement-‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ : ఏ ఒక్కరిని వదలక ఏకిపారేసిన పవన్

Related Articles

Latest Articles