జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

ఏపీలో ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడి’ అంటూ ఆదివారం విమర్శలు చేసిన పవన్.. సోమవారం కూడా ట్విట్టర్ వేదికగా వైసీసీని ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేశారు. కర్ణాటక మంగుళూరు ప్రాంతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి అందరికీ స్ఫూర్తిదాయకమని పవన్ ప్రశంసించారు.

Read Also: డేవిడ్ వార్నర్‌పై హీరో మహేష్‌ బాబు ప్రశంసల జల్లు

హజబ్బ అనే పండ్ల వ్యాపారి తన సొంత డబ్బుతో స్కూల్ నిర్మించాడని.. ఇప్పుడు ఆయన వయసు 60 ఏళ్లు అని పవన్ తెలిపారు. అలాంటి వ్యక్తి దేశంలోనే నాలుగో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీ అవార్డు పొందారని పవన్ గుర్తుచేశారు. ఒక విదేశీయుడు నారింజ పండ్లు కిలో ఎంత అని ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్న అతడి స్ఫూర్తికరమైన జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పిందన్నారు. తనకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడంతో హజబ్బా తిరిగి సమాధానం చెప్పలేకపోయారని.. భవిష్యత్ తరాలు తనలా కాకూడదనే భయంతో ఆయన తన గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారని ట్వీట్‌లో పేర్కొన్నారు. పండ్ల అమ్మకాలతో పాటు ఇతరుల నుంచి సేకరించిన విరాళాలతో స్కూల్‌ను ఏర్పాటు చేశారని.. అలాంటి వ్యక్తి ఎంతో కష్టపడి స్కూల్ నిర్మిస్తే… ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం ఎయిడెడ్ స్కూళ్లనే మూసివేస్తుందని పవన్ ఎద్దేవా చేశారు.

Related Articles

Latest Articles