కరోనాపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి: పవన్ కళ్యాణ్

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఒక్కరోజులోనే లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయని.. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ తిరుగుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. సంక్రాంతిని కుటుంబసభ్యులతో మాత్రమే జరుపుకోవాలని, బయటికెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Read Also: సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి

కరోనా సెకండ్‌వేవ్‌లో మందులు, ఆక్సిజన్ దొరక్క ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని… ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను పవన్ కళ్యాణ్ కోరారు. ఆయా ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు కరోనా టీకా తీసుకోనివారు ఉంటే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని.. విందులు, వినోదాలు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గమని పవన్ అభిప్రాయపడ్డారు.

Related Articles

Latest Articles