పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

జనసేన కార్యనిర్వాహక సభ్యులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరితో కలిసి చర్చించాకే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామన్నారు. రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పొత్తుల కంటే ముందుగా పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలని సూచించారు.

పొత్తులపై అందరిదీ ఒకే మాటగా ఉండాలని.. తాను ఒక్కడినే సింగిల్‌గా పొత్తులపై నిర్ణయం తీసుకునేది ఉండదని పవన్ తెలిపారు. పొత్తులనేవి ప్రజాస్వామ్యంగా, ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని హితవు పలికారు. పొత్తులపై నిర్ణయం తీసుకునేలోగా ఎవ్వరూ వేరే విధంగా మాట్లాడొద్దని సూచించారు. వేర్వేరు పార్టీలు ఆడే మైండ్ గేములో పావులు కావొద్దన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై దృష్టి పెట్టాలని సూచించారు.

కరోనా కారణంగా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించలేకపోయామని.. కానీ క్షేత్రస్థాయిలో జనసేన బలం పుంజుకుంటోందన్నారు. ఏపీలో ఏ మూలకెళ్లినా జనసేన జెండా రెపరెపలాడుతోందని పవన్ పేర్కొన్నారు. పార్టీ స్థాపించే సమయంలో పార్టీ వెంట ఉన్న యువకులే నేడు నేతలుగా ఎదిగారన్నారు. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే యువతరం మనతోనే ఉందని వ్యాఖ్యానించారు. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తామని పవన్ తెలిపారు. ఇప్పటికే 400 మండలాల్లో పార్టీ కమిటీలు వేసుకున్నామని పవర్ గుర్తుచేశారు.

Read Also: సినిమా టిక్కెట్ల వివాదంలోకి టీడీపీని లాగొద్దు: చంద్రబాబు

Related Articles

Latest Articles