50 ఏళ్ళ ‘పవిత్ర హృదయాలు’

నటరత్న యన్.టి.రామారావు హీరోగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవిత్ర హృదయాలు’ చిత్రం పార్ట్ లీ కలర్ లో రూపొందింది. 1971లో యన్టీఆర్ నటించిన ఎనిమిదవ చిత్రమిది. ఆ యేడాది తెలుగునాట రంగుల చిత్రాల హవా విశేషంగా వీచడం మొదలయింది. ఈ నేపథ్యంలో ‘పవిత్ర హృదయాలు’లో కొన్ని పాటలు రంగుల్లో దర్శనమిచ్చాయి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు చెల్లెలిగా నటించిన చంద్రకళ, ‘మాతృదేవత’ చిత్రంలో కూతురుగానూ అభినయించింది. యన్టీఆర్ సరసన నాయికగా ఆమె తొలిసారి ‘తల్లా?పెళ్ళామా?’లో నటించగా, ఈ ‘పవిత్ర హృదయాలు’ రెండవ చిత్రం. 1971 నవంబర్ 24న ఈ సినిమా విడుదలయింది

‘పవిత్ర హృదయాలు’ కథ విషయానికి వస్తే – భుజంగరావు అనే ఓ జమీందార్ కు ఇద్దరు మనవళ్ళు ఉంటారు. పెద్దవాడు నరేంద్ర బాబు, చిన్నవాడు రవీంద్ర బాబు. ఇద్దరికీ తాత స్వేచ్ఛనిస్తారు. వీరి ఆస్తి కాజేయాలని వీరి సమీపబంధువు శేషగిరి ప్రయత్నిస్తూఉంటాడు. నరేంద్రను వ్యసనాలకు బానిసగా మారుస్తాడు. రవీంద్ర మాత్రం ఓ గాయకునిగా స్థిర పడతాడు. ఒకప్పుడు భుజంగరావు వద్ద పనిచేసే శివయ్య తాగుబోతు. దాంతో అతని పెద్ద కూతురు సుశీల కుటుంబభారం మోస్తూ ఉంటుంది. ఆమె చెల్లెలు విజయ చదువు కుంటుంది. ఓ సందర్భంలో రవీంద్రతో విజయకు పరిచయం అవుతుంది. సుశీలను వారి ఇంటి ఓనర్ పానకాలు సొంతం చేసుకోవాలని చూస్తూంటాడు. అతనిని శివయ్య చావగొడతాడు. జనం సుశీలను నిందిస్తే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెను నరేంద్ర కాపాడతాడు. ఆమె కారణంగా నరేంద్ర మారిపోతాడు. ఈ లోగా భుజంగరావును ఓ చోట బంధించి, అతని స్థానంలో మరో వ్యక్తిని పెట్టి, ఆటాడిస్తుంటాడు శేషగిరి. ఈ విషయం రవీంద్రకు తెలుస్తుంది. మారు వేషాలు వేసి, చివరకు శేషగిరిని బురిడీ కొట్టిస్తాడు. తమ తాతను విడిపించుకొని, అసలు దోషులను చట్టానికి అప్పగిస్తారు. సుశీలను నరేంద్ర, ఆమె చెల్లెలు విజయను రవీంద్ర పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో రవీంద్రగా యన్టీఆర్, నరేంద్రగా గుమ్మడి, సుశీలగా జమున, విజయగా చంద్రకళ నటించారు. మిగిలిన పాత్రలలో చిత్తూరు నాగయ్య, సత్యనారాయణ, శాంతకుమారి, ధూళిపాల, మద్దినేని, రాజనాల, అల్లు రామలింగయ్య, రాజబాబు, సంధ్యారాణి తదితరులు కనిపించారు. ఈ చిత్రానికి డాక్టర్ సి.నారాయణ రెడ్డి పాటలు రాయగా, టి.చలపతిరావు సంగీతం సమకూర్చారు. ఇందులోని “శరణన్న వారిని కరుణించే తిరుమలవాసా జగదీశా…” పాట భక్తకోటిని అలరించింది. “చిరునవ్వుల చినవాడే…”, “పలికేది నేనైనా…”, “చుక్కల చీర…” పాటలు కలర్ లో చిత్రీకరించారు. “పలికేది నేనైనా…” పాటను ప్రముఖ సంగీత విద్యాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన్న సత్యనారాయణ కలసి పోటీ పడి పాడడం విశేషం. శ్రీవిజయ వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.యస్.రాజు నిర్మించారు. ఈ చిత్రానికి పినిశెట్టి కథను అందించారు.

Related Articles

Latest Articles