పాక్‌లో ఉద్రిక్తత.. ఇమ్రాన్ గద్దెదిగాలని నిరసనలు

పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనకు దిగుతుండడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. తన విధానాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్‌తో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు వేలాది మంది కరాచీలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు.

ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ధరల మంటతో పేదలు కడుపునిండా తినలేని పరిస్థితి వచ్చిందని, దీనికి ఇమ్రాన్ విధానాలే కారణమని ని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌ఖాన్‌కు తెలియదని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జమీయత్ ఉలేమా-ఇ-ఇస్లాం సంస్థ నేత రషీద్ సుమ్రో డిమాండ్ చేశారు.

గతేడాది ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అరెస్ట్ చేసిన తమ నేతలను విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌ వరకు నిర్వహిస్తున్న లాంగ్‌మార్చ్‌ను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. పోలీసులు వారిపై బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. మరో వైపు బహుమతుల అమ్మకం ఇమ్రాన్‌ ఖాన్ ఇమేజ్‌ని మరింత డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. ఇతర దేశాధినేతలు అందజేసిన బహుమతులను ఇమ్రాన్ అమ్ముకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. గల్ఫ్ దేశ యువరాజు ఇచ్చిన అత్యంత ఖరీదైన గడియారాన్ని విక్రయించారు. సుమారు రూ.7.4 కోట్లను ఇమ్రాన్ తన జేబులో వేసుకున్నారని విపక్ష పార్టీల నాయకులు ఆరోపించిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles