మరపురాని మధురం… పి.బి.శ్రీనివాస్ గానం!

(సెప్టెంబర్ 22న పి.బి.శ్రీనివాస్ జయంతి)

మనసు బాగోలేనప్పుడు తాము పి.బి.శ్రీనివాస్ పాటలు వింటూ ఉంటామని ఎందరో సంగీతంలో ఆరితేరిన పండితులు వ్యాఖ్యానించారు. దానిని బట్టే పి.బి.శ్రీనివాస్ గాత్ర మహాత్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతివాది భయంకర శ్రీనివాస్ గానం ప్రతివాదులను భయపెట్టలేదు కానీ, వారి మనసులను సైతం కరిగించింది అని అభిమానులు అంటారు. తెలుగునాట పుట్టినా, పరభాషల్లోనే తనదైన బాణీ పలికించారు పి.బి.శ్రీనివాస్. మాతృభాషపై మమకారంతో ఎంత బిజీగా ఉన్నా, తెలుగు పాటలు పాడి పరవశించిపోయేవారు శ్రీనివాస్. గాయకునిగానే కాదు, గీత రచయితగా, స్వరకర్తగా శ్రీనివాస్ సాగిన తీరు సంగీతప్రియులను మైమరిపించింది. తమిళ, కన్నడ సీమల్లో పి.బి.శ్రీనివాస్ పాటకు పట్టాభిషేకం చేశారు. ఇక కన్నడిగులు పి.బి.శ్రీనివాస్ కు తమ హృదయాల్లో గుడినే కట్టేశారు. అది చూసి తెలుగువారు పి.బి.శ్రీనివాస్ మావాడే అంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.

పి.బి.శ్రీనివాస్ 1930 సెప్టెంబర్ 22న కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి ఫణీంద్రస్వామి ప్రభుత్వోద్యోగి. తల్లి శేషగిరమ్మ సంగీతంలో ప్రవీణురాలు. దాంతో పి.బి.కి చిన్నతనంలోనే పాటలు పాడటం అబ్బింది. వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ ను ప్రభుత్వ అధికారిగా చూడాలనుకున్నారు. అయితే తల్లి ప్రభావంతో పి.బి.శ్రీనివాస్ గానంతోనే సాగారు. బి.కామ్., పూర్తయిన తరువాత నుంచీ పాటగాడిగా మారాలనే ప్రయత్నాలు మొదలెట్టారు శ్రీనివాస్. తెలుగులో అప్పటికే ఘంటసాల మాస్టారు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యమేలుతున్నారు. దాంతో పి.బి.శ్రీనివాస్ కు ఆట్టే అవకాశాలు లభించలేదు. ఉత్తరాది బాట పట్టి అక్కడ కొన్ని చిత్రాలలో కోరస్ పాడారు. తరువాత 1952లో రూపొందిన ‘మిస్టర్ సంపత్’ చిత్రంలో “అజి హమ్ భారత్ కీ నారీ…” సాంగ్ లో గీతా దత్ తో కలసి గానం చేశారు. అదే పి.బి. స్వరంలో జాలువారిన తొలి గీతం. తరువాత తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనూ పి.బి.శ్రీనివాస్ పాటలు పాడారు. ఇక తెలుగునాట యన్టీఆర్, ఏయన్నార్ కు నేపథ్యగానం చేసినా, ఎక్కువగా జగ్గయ్య, కాంతారావుకు పి.బి.శ్రీనివాస్ పాటలు పాడి అలరించారు. యన్టీఆర్ కు పి.బి. శ్రీనివాస్ నేపథ్యగానం చేసిన “ఆడబ్రతుకు, ఇంటికిదీపం ఇల్లాలే” వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. యన్టీఆర్ ‘మంచిమనిషి’లో జగ్గయ్యకు పి.బి.పాడిన “ఓహో గులాబి బాలా…” పాట తెలుగునాటనే కాదు, అంతటా ఉన్న పి.బి.శ్రీనివాస్ అభిమానులందరినీ అలరించింది. తరువాతి రోజుల్లో హరనాథ్, చలం వంటి నటులు కూడా పి.బి.శ్రీనివాస్ పాటలతోనే సాగారు. తమిళనాట జెమినీగణేశన్, శివాజీగణేశన్, ఎమ్.జి.రామచంద్రన్ కు కూడా పి.బి.శ్రీనివాస్ పాటలు పాడారు. జెమినీ గణేశన్ కు పి.బి. పాడిన పలు పాటలు ఈ నాటికీ పరవశింప చేస్తూనే ఉన్నాయి.

పి.బి.శ్రీనివాస్ దక్షిణాది అన్ని భాషల్లోనూ పాటలు పాడినా, కన్నడనాట రాజ్ కుమార్ కు పాడిన పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. రాజ్ కుమార్ స్వతహాగా గాయకుడైనా, పి.బి.శ్రీనివాస్ గానంతోనే ఆయన స్టార్ హీరోగా నిలిచారు. దాంతో పలు సంవత్సరాలు రాజ్ కుమార్ అభినయానికి, పి.బి.శ్రీనివాస్ గానానికి జోడీ కుదిరి అనేక మ్యూజికల్ హిట్స్ కన్నడ చిత్రసీమలో నిలిచాయి. రాజ్ కుమార్ ‘సంపత్తిగే సవాల్’ తరువాత నుంచీ సొంతగా పాటలు పాడుకోవడంతో, విష్ణువర్ణన్, శ్రీనాథ్, కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్ వంటివారికి పి.బి. పాటలు పాడారు. ఆ పాటలు సైతం మధురామృతం పంచాయి. ఇలా అన్ని భాషల్లోనూ అలరించిన పి.బి.శ్రీనివాస్ గానం, మాతృభాష తెలుగులోనూ కొన్నిసార్లు అమృతం కురిపించింది.

పి.బి.శ్రీనివాస్ కొన్ని చిత్రాలకు పాటలు కూడా రాశారు. కె.బాలచందర్ ‘ఆకలిరాజ్యం’లోని “తుహై రాజా మై హూ రాణీ…” హిందీ పాటను పి.బి.శ్రీనివాస్ రాయడం విశేషం. తరువాతి రోజుల్లో ఆయన సొంతగా ఓ ఛందస్సును రూపొందించి, అందులో పద్యాలు రాశారు. ఆయన మనవడు పి.బి. ఆనందవర్ధన్ అప్పట్లో బాలనటునిగా పలు చిత్రాలలో అలరించారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన తరువాత భారీగా సన్మానం జరిగింది. అందులో తాను ఈ స్థాయికి రావడానికి పి.బి.శ్రీనివాస్ గానమే ప్రధాన కారణమనీ ఆ మహానటుడు వినమ్రంగా చెప్పారు. అంతేకాదు, పి.బి.శ్రీనివాస్ కన్నడ పాటకు ఆత్మ అనీ ఆయన శ్లాఘించారు. పి.బి.శ్రీనివాస్ మరణానంతరం బెంగళూరులోని ఓ పార్కుకు ఆయన పేరే పెట్టారు. ఇలా కన్నడిగుల గుండెల్లో గుడికట్టుకున్నారు మన పి.బి.శ్రీనివాస్. అందుకే పి.బి.శ్రీనివాస్ పాట మరపురానిది, మరువలేనిది అని అందరూ అంటారు. 2013 ఏప్రిల్ 14న పి.బి.శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన లేకున్నా, పి.బి. పంచిన మధురామృతం ఈ నాటికీ మనలను ఆనందంలో ముంచెత్తుతూనే ఉంది.

-Advertisement-మరపురాని మధురం… పి.బి.శ్రీనివాస్ గానం!

Related Articles

Latest Articles