ముదురుతున్న చమురు యుద్ధం !

లీటర్ పెట్రోలు ధర ఇప్పుడు 100 రూపాయలు దాటింది. రాష్ట్రాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో 110 రూపాయలుగా కూడా ఉంది. డీజిల్ ధర కూడా వందకు చేరింది. రాబోయే రోజుల్లో పెట్రో ధరలు ఇంకా పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో తరచూ పాక్షిక హెచ్చు తగ్గులు సహజం. ఒక్కోసారి ఉన్నట్టుండి బాగా తగ్గుతాయి. మరి కొన్ని సార్లు ఊహించనంత పెరుగుతాయి.

2020 ఏప్రిల్‌లో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర కేవలం 19 డాలర్లు. అదే 2014లో బ్యారెల్‌ ధర 108 డాలర్లకు చేరింది. మూడేళ్ల నుంచి 75-85 డాలర్ల మధ్య నడుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 86 డాలర్లు. త్వరలో 100 డాలర్లకు చేరుతుందనే సంకేతాలు అందుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర రోజు రోజుకు మారుతూ ఉంటుంది. ఐతే, అది ఒక డాలరో, రెండు డాలర్లో అయితే ప్రభుత్వాలకు పెద్ద ఇబ్బంది లేదు. కానీ, ఎక్కువ మొత్తంలో పెరిగితేనే చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర తక్కువగా ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నులు వేసి ఆదాయం పొందుతాయి.దాంతో ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది. ఆ అసంతృప్తిని వారు ఎన్నికల్లో చూపిస్తారు. ఇటీవల జరిగిన దేశ వ్యాప్త ఉప ఎన్నికల్లో అదే జరిగింది. మెజార్టీ సీట్లలో బీజేపి ఓటమికి ప్రధాన కారణం పెరిగిన పెట్రో ధరలే. దాంతో కేంద్రం పెట్రోల్‌ డీజీల మీద పన్ను తగ్గించింది.

నేడు అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా పరిణమించాయి. కాబట్టి ముడి చమురు ధరలను నియంత్రించే ఉద్దేశంతో అమెరికా, చైనా, భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రిటన్‌ దేశాలు చేతులు కలిపాయి. ఇవి పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య -ఒపెక్‌ ప్లస్‌తో పోరుకు సిద్ధమయ్యాయి. ఓపెక్‌ ప్లస్‌ దేశాలు దిగొచ్చేలా చేసేందేకే అమెరికా అధ్యక్షుడు ఓ ఫార్ములాను ముందుకు తెచ్చాడు. అదేమిటంటే ఎమర్జెన్సీ అవసరాల కోసం ఆయా దేశాలోని వ్యూహాత్మక నిల్వల నుంచి కొంత చమురును మార్కెట్లోకి విడుదల చేయటం. అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌ చేసిన ఈ ప్రతిపాదనను గ్రూపులోని అన్ని దేశాలు అంగీకరించాయి.

కష్టంకాలంలో, అంటే అనుకోని సంక్షోభాలు తలెత్తి చమురు సరఫరా ఆగిపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ స్తంభించకుండా ఉండేందుకు అన్ని దేశాల వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు ఉంటాయి. ఇప్పటి వరకు వాటిని అవి కేవలం ఎమర్జెన్సీ అవసరాలకే వినియోగించాయి. ఐతే, ఇప్పుడు అలా కాకుండా ఇతర కారణాల వల్ల అమెరికా ప్లస్‌ దేశాలు ఈ రిజర్వ్స్‌ నుంచి కొంత బయటకు తీసే విధానాన్ని తీసుకున్నాయి. ఆయిల్‌ వినియోగంలో అమెరికా, చైనా తరువాత స్థానం భారత్‌దే. కనుక ఇవి తమ దగ్గర ఉన్న నిల్వల నుంచి కొంత తీసి వినియోగించుకుంటే చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గుతాయన్నది బైడెన్‌ ఆలోచన కావచ్చు.

ఐతే, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. బైడన్‌ చెప్పినట్టు చేస్తే నిజంగా ధరలు తగ్గుతాయా? తగ్గుతాయో లేదో తెలియదు. తగ్గకపోగా పెరిగే అవకాశాలనూ కొట్టిపారేయలేము. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ముడిచమురు నిక్షేపాలలో 80 శాతం ఓపెక్ ప్లస్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వాటి వద్ద పదకొండు వందల బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇదిగాక ఇంకా కొన్ని లక్షల బ్యారళ్ళ మిగులు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఐనా కూడా ప్రపంచ దేశాల వినియెగానికి తగ్గట్టు ఉత్పత్తి పెంచడం లేదు. కరోనా పరిస్థితులను సాకుగా చూపుతోంది. కావాలనే ఉత్పత్తిని తగ్గించి ధరలు పెరిగేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓపెక్‌ ప్లస్‌కు అమెరికా సవాలు విసిరింది. డిసెంబర్‌ 2న జరిగే సమావేశంలో ఒపెక్‌ ప్లస్‌ దీనిపై ఓ విధాన పరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇది ఇలావుంటే, ప్రస్తుతం అమెరికా వద్ద దాదాపు ఏడు వందల మిలియన్‌ బ్యారెళ్ల ముడి చములు నిల్వలు ఉన్నాయి. అలాగే చైనా వద్ద 238 బ్యారెళ్లు ఉండగా భారత్‌ వద్ద కేవలం 39 మిలియన్‌ బ్యారళ్ల క్రూడాయిల్‌ నిల్వలు మాత్రమే ఉన్నాయి. వీటి ఉద్దేశం ఎమర్జెన్సీ అవసరాలు తీర్చటం. ఈ దేశాలతో పోలిస్తే ఓపెక్‌ ప్లస్‌ ఎంతో బలమైనది. దీనితో పోటీ పడి తట్టుకోగలవా? తట్టుకోలేవని ఇప్పటికే ఓపెక్‌ ప్లస్‌కు అర్థం అయింది. అప్పుడే వ్యతిరేక చర్యలకు దిగాయి. చమురు సరఫరా పెంచేందుకు రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్ల చమురును అదనంగా ఉత్పత్తి చేస్తామని ఓపెక్‌ ప్లస్‌ గతంలో ప్రకటించింది. ఐతే, వ్యూహాత్మక నిల్వల నుంచి చమురు బయటకు తీస్తామని అమెరికా ప్లస్‌ దేశాలు ప్రకటించిన తరువాత దానిని ఉపసంహరించుకుంటామని ప్రకటించింది.

ఓపెక్‌ ప్లస్‌తో పోటీ పడి అమెరికా కూటమి దేశాలు నిలుస్తాయనుకోము. కాబట్టి, ఈ వ్యూహాత్మక పోరులోకి భారత్‌ అనవసరంగా దిగిందేమో అనిపిస్తుంది. విశ్లేషకులు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మన దగ్గర కేవలం 39 మిలియన్‌ బ్యారెళ్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇదంతా కలిసి వారానికి సరిపోదు. ప్రతి రోజు దాదాపు నాలుగు మిలియన్‌ బ్యారళ్ల చమురు మనకు అవసరం. నిల్వల నుంచి ఐదు మిలియన్‌ బ్యారెళ్లు తీస్తున్నట్టు ఇండియా ప్రకటించింది. దాంతో వారం రోజులకు సరిపోయే నిల్వలు ఇప్పుడు అయిదు రోజులకే సరిపోతాయి.

అత్యవసరాల కోసం ఉంచిన దానిని వేరే దాని కోసం వాడటం ఎంత వరకు శ్రేయస్కరం? ఉన్న ఆ కొద్ది నిల్వలను ఇప్పుడు ఖాళీ చేస్తే రేపు పరిస్థితి ఏమిటి? అమెరికా, చైనా దగ్గర చాలా రోజులకు సరిపడ నిల్వలు ఉన్నాయి. వాటికి పోయేదేమీ లేదు ..మన పరిస్థితి అలా లేదు. ఇప్పుడు ఉన్నది వాడేసి రేపు మళ్లీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కొనాలంటే కష్టం. ఇప్పటికే మార్కెట్లో ధరలు మండుతున్నాయి. రేపు ఇంకా ఎక్కువ ధరకు కొని నిల్వ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి, అమెరికా, చైనా వంటి అగ్రదేశాలు చేసే ఈ యుద్ధంలో మనం చేరితో కలిగే ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువని అర్థం చేసుకోవాలి.

ఇది ఇలావుంటే, ముడి చమురు సంక్షోభం స్టాక్‌ మార్కెట్లపై వ్యతిరేకం ప్రభావం చూపుతున్నాయి. అమెరికా కూటమి తీరుపై ఆయిల్‌ ఉత్పత్తి దేశాలు ఎలా స్పందిస్తాయనే దానిపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. ఓపెక్‌ ప్లస్‌గా పిలుస్తున్న పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ , రష్యా, దాని మిత్రదేశాలు అదనపు చమురు ఉత్పత్తిపై విధానాన్ని సెట్ చేయడానికి డిసెంబర్ 1-2న సమావేశమవుతాయి.

ఓపెక్‌ ప్లస్‌ గత ఆగస్ట్ నుంచి రోజుకు అదనంగా నాలుగు లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. దీంతో గత ఏడాది కరోనా కారణంగా తలెత్తిన అవుట్‌పుట్ కోతలు తగ్గిస్తున్నాయి. ఒపెక్ ప్లస్‌ ఒప్పందానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని దాని సభ్య దేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ ప్రకటించాయి. వచ్చే వారం సమావేశం పట్ల తమకు ఎటువంటి ముందస్తు వైఖరి లేదని స్పష్టం చేశాయి.

మరోవైపు, డిసెంబరు చివరి నుంచి ఏప్రిల్ 2022 మధ్య సరఫరా అయ్యేలా 32 మిలియన్‌ బ్యారెళ్ల వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల విక్రయానికి అమెరికా ఇందన విభాగం వేలం ప్రారంభించింది. త్వరలో మరో 18 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేయనుంది. ఏదేమైనా ప్రస్తుతం నెలకొన్న చమురు ధరల సంక్షోభం ఏ మలుపు తీసుకుంటుందనేది డిసెంబర్‌ 2 తరువాత కాని తెలియదు!!

-Dr. Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles