టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1) తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని… తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోనని చిరంజీవి స్పష్టం చేశారు.

2) సఫారీ గడ్డపై టీమిండియా మరోసారి నిరాశపరిచింది. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ భారత్ ఓటమి పాలయ్యింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని నాలుగో రోజు లంచ్ ముగిసిన వెంటనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది.

3) ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తనకు నివాసానికి ఎవరూ రావొద్దని.. ఏదైనా అత్యవసరమైతే తనను ఫోన్ ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.

4) మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు పై తీవ్రంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో శవరాజకీయాలు చేసేది చంద్రబాబే నని అది అందరికి తెలుసని చెప్పారు. హత్యారాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందన్నారు. నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబే అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు రాక్షస ఆలోచనలు భోగి మంట్లలో తగలబడాలని కోరుకుంటున్నా అంటూ మంత్రి వెల్లంపల్లి చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు.

5) గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం మాయమైంది. గతంలో జొన్నలగడ్డ సొసైటీ బిల్డింగ్ ప్రాంగణంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను పక్కపక్కనే అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని అభిమానులు ఆరోపిస్తున్నారు.

6) గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ బట్టల్లో కనిపించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలోని గోశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలకు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

7) కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయింది. వైద్యసిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో గురువారం నాటికి మొదటి డోస్‌ 2.93 కోట్లు, రెండో డోస్‌ 2.06 కోట్లు, ప్రికాషన్‌ డోస్‌ మరియు బూస్టర్‌ డోస్ 1.13 లక్షల డోసులు పంపిణీ చేశారు.

8) టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య బాధాకరమని చంద్రబాబు అన్నారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. హత్యా రాజకీయాలు నేను ప్రోత్సహించనన్నారు. రౌడీలపై తీవ్రవాదులపై పోరాడిన చరిత్ర టీడీపీది. చెంచాలతో మాట్లాడించడం కాదు జగన్‌ రెడ్డి దమ్ముంటే నువ్వు రా.. అంటూ సవాల్‌ విసిరారు.

9) రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రిపోర్టులోని అంశాలను ఆయన వెల్లడించారు. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు.

10) తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం పంపిణీ చేసే గడువును కేసీఆర్ సర్కార్ ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రారంభం అవుతుంది. అలాగే రేషన్ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల ఒకటో తేదీన ప్రారంభమైన రేషన్ పంపిణీ ప్రక్రియ అదే నెల 15వ తేదీన ముగుస్తుంది.

Related Articles

Latest Articles