ఆలస్యం కానున్న ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్…!

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు సినిమా ఇండస్ట్రీపై కూడా బాగా పడుతోంది. కరోనా వల్ల స్టార్స్ అంతా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు ఆలస్యం కాబోతున్నాయి. ఎన్టీఆర్ భవిష్యత్ ప్రణాళికలకు కరోనా బ్రేక్ వేసేసింది. కరోనా కారణంగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న బుల్లితెర షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడింది. కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి పోటీదారులను ప్రదర్శనకు తీసుకురావడం ఛానెల్ కు ఇబ్బందిగా మారింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయిన వెంటనే సమయాన్ని వృథా చేయకుండా కొరటాలతో సినిమాను ప్రారంభించాలని అనుకున్నాడు ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మేలో పూర్తవుతుందని భావించి, కొరటాల చిత్రం జూన్ లోనే ప్రారంభం అవుతుందని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎన్టీఆర్ అంచనాలన్నీ తప్పి ఈ మూడు ప్రాజెక్టులూ నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితి కారణంగా సినిమా షూటింగులు ఎప్పుడు మొదలవుతాయి కూడా తెలియదు. పరిస్థితులు నార్మల్ అయ్యాక ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టులన్నీ మళ్ళీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. కరోనా వల్ల ఎన్టీఆర్ ప్రాజెక్టులన్నీ ఆలస్యం కాబోతున్నాయన్నమాట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-