రివ్యూ: నో టైమ్ టు డై (డబ్బింగ్)

‘జేమ్స్ బాండ్’ కేవలం గూఢచారి మాత్రమే కాదు… ఓ బ్రాండ్. వెండితెరపై జేమ్స్ బాండ్ 007 కనిపిస్తే చాలు… గూజ్ బంబ్స్ ను ఫీలయ్యే ఆడియెన్స్ వరల్డ్ వైడ్ వందల కోట్లమంది ఉన్నారు. ఆ సీరిస్ లో వచ్చిన 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. డేనియల్ క్రేయిగ్ పదహారేళ్ళ క్రితం ‘రాయల్ కేసినో’ మూవీతో బాండ్ బాటలోకి వచ్చాడు. గడిచిన 16 సంవత్సరాలలో ఐదు బాండ్ ఫీచర్ ఫిల్మ్స్ చేశాడు. శుక్రవారం ఆంగ్లంతో పాటు ఇతర భారతీయ భాషల్లో విడుదలైన ‘నో టైమ్ టు డై’ అతను నటించిన చివరి బాండ్ మూవీ కావడం విశేషం.

‘నో టైమ్ టు డై’ సినిమా కోసం కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జేమ్స్ బాండ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు జనం ముందుకు వచ్చింది. అయితే వారందరి ఎదురుచూపులకు తగ్గట్టుగా మాత్రం సినిమా లేదు. కథగా చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. ఓ ప్రైవేట్ లేబోరేటరీలోని బయో వెపన్ ను స్పెక్టర్ ముఠా దొంగిలిస్తుంది. దానిని ఉపయోగించి ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవాలన్నది సాఫిన్ కోరిక. ఐదేళ్ళుగా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న జేమ్స్ బాండ్ ను బయో వెపన్ ఆచూకీ తెలుసుకోవాల్సింది అధికారులు కోరతారు. సాఫిన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని, అతనుండే ఐలెండ్ కు బాండ్ చేరుకుని, దాన్ని ధ్వంసం చేయడంతో సినిమా ముగుస్తుంది. ఇది బాండ్ గా డేనియల్ క్రేయిగ్ చేసిన చివరి చిత్రం కావడంతో, ఆ పాత్రను చంపేసి దర్శకుడు క్యారీ జోజి ఫుకునాగా విషాదకరమైన ముగింపును ఇచ్చాడు.

వెస్పర్ లిండ్ ను కోల్పోయిన తర్వాత చాలా కాలం బాండ్ మామూలు మనిషి కాలేకపోతాడు. అదే సమయంలో అతనికి దగ్గరైన మరో సీక్రెట్ ఏజెంట్ మడెలీన్ లో ప్రేమను వెతుక్కుంటాడు. అయితే… వారిద్దరూ ఏకాంతంగా ఉన్న చోటు ప్రత్యర్థులకు తెలిసి, బాండ్ మీద అటాక్ చేస్తారు. అంతేకాదు… స్పెక్టర్ కు చెందిన వ్యక్తులు బాండ్ కు మెడెలీన్ పై అనుమానం కలిగేలా ప్రవర్తిస్తారు. దాంతో ఆమెను తన నుండి దూరంగా పంపేస్తాడు బాండ్. తానూ ఐదేళ్ల పాటు అందరికీ, అన్నింటికీ దూరంగా ఉంటూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతాడు. అయితే… ఊహించని విధంగా ఇప్పుడీ కొత్త అస్సైన్ మెంట్ ను అతను టేకప్ చేయాల్సి వస్తుంది. సాఫిన్ ను వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో తన పాత ప్రత్యర్థి రూఫెల్డ్ ను బాండ్ చంపేస్తాడు. మరోసారి అతని జీవితంలోకి మడెలీన్ వచ్చాక, ఆమె తప్పు ఏదీ లేదనే విషయాన్ని తెలుసుకుంటాడు. అంతేకాదు, తమకో పాప కూడా ఉందని తెలిసి ఆనంద పడతాడు. బయో వెపన్ ను నిర్వీర్యం చేయడం ద్వారా ప్రపంచ ప్రజానీకాన్ని, అదే సమయంలో సాఫిన్ చేతిలో చిక్కుకున్న భార్య, బిడ్డను రక్షించడానికి బాండ్ తన జీవితాన్ని ఎలా పణంగా పెట్టాడన్నది చిత్ర కథ.

నిజానికి జేమ్స్ బాండ్ మూవీగా దీనిని భావించడానికి మనసు ఒప్పుకోదు. బాండ్ మూవీస్ లో ఉండే గ్రాండియర్, ప్రొడక్షన్ వాల్యూస్, టెంపో, రోమాంచితమైన యాక్షన్స్ సీన్స్ ఇందులో చెప్పుకోదగ్గట్టు లేవు. సినిమా ప్రారంభంలో వెస్పర్ లిండ్ సమాధి దగ్గర జరిగే యాక్షన్ సీన్ కాస్తంత మెప్పిస్తుంది. బాండ్ వాడే కారులో ఉండే సరికొత్త టెక్నికల్ ఫీచర్స్ ను ఈ ఎపిసోడ్ లో మరోసారి చూపించారు. ఇక ఆ తర్వాత సినిమాలో వచ్చే మూడు నాలుగు పోరాట దృశ్యాలూ పెద్దంతగా ఆకట్టుకోవు. ఈ సినిమాలో విలన్ పాత్ర బలంగా లేకపోవడం మెయిన్ మైనస్. తండ్రి అడుగు జాడల్లో ఈ ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి సాఫిన్ బయో వెపన్ ను ఆశ్రించినట్టు చూపించినా, దానిని అతను ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాడనే విషయంలో దర్శకుడు వివరణ ఇవ్వలేదు. లవ్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు కొన్ని ఉన్నా, అవేవీ హృదయానికి హత్తుకునేలా లేవు. ఇక క్లయిమాక్స్ మరీ బలహీనంగా ఉండటం, మూవీ రన్ టైమ్ కూడా రెండున్నర గంటలకు పైగా ఉండటంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. బాండ్ కు ఉండే ఇమేజ్ ను పట్టించుకోకుండా, అనేకానేక సందర్భాలలో దర్శక రచయితలు పలచన చేయడం బాగోలేదు.

ఇటీవల ఓ సర్వేలో ఇంతవరకూ జేమ్స్ బాండ్ పాత్రలను బాగా పోషించిన నటుల్లో డేనియల్ క్రేయిగ్ కే పదికి పది మార్కులు వచ్చాయి. కానీ అతను ‘నో టైమ్ టు డై’ లాంటి సినిమా ద్వారా బాండ్ పాత్రకు వీడ్కోలు పలకాల్సి రావడం కాస్తంత బాధగానే ఉంది. ఇదే చివరి బాండ్ మూవీగా హీరో డేనియల్, మూవీ డైరెక్టర్ క్యారీ భావించి ఉంటే… ఇలా తీసి ఉండేవారు కాదనిపిస్తుంది. ఏదేమైనా బాండ్ చిత్రాల మీద, డేనియల్ క్రేయిగ్ మీద అభిమానం ఉన్నవారు ఓసారి చూడొచ్చు.

ప్లస్ పాయింట్

  • బాండ్ మూవీ కావడం
  • డేనియల్ క్రేయిగ్ నటించడం
  • మూవీ ప్రారంభంలోని యాక్షన్ సీన్

మైనెస్ పాయింట్

  • బలంమైన కథ లేకపోవడం
  • మూవీ రన్ టైమ్
  • విషాదకరమైన ముగింపు

ట్యాగ్ లైన్: బోర్ కొట్టించే బాండ్!

రేటింగ్: 2.5 /5

-Advertisement-రివ్యూ: నో టైమ్ టు డై (డబ్బింగ్)

SUMMARY

No Time to Die movie review

Related Articles

Latest Articles