ఆర్టీసీలో రిటైర్మెంట్ వయసు మళ్ళీ పెంచుతారా?

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు లేనట్లేనా? ముఖ్యమంత్రి హామీ పై ఉన్నతాధికారులు కసరత్తు చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వరం కార్పొరేషన్ ఉద్యోగులకు వర్తించదా? ఆర్టీసీ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ పై ఉద్యోగులు ఏమంటున్నారు?. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అంశం మరోసారి చర్చకొచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. అప్పట్లోనే ఆర్టీసీ కూడా తన ఉద్యోగులకు దాన్ని వర్తింప చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ 2019 సమ్మె సమయంలోనే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంటు వయసును 60 ఏళ్లకు పెంచింది. మళ్లీ 61 ఏళ్ల పెంపు ప్రతిపాదన రావడంతో ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు.

కానీ వయసు పైబడే కొద్దీ బస్సులు నడపటం కష్టంగా ఉంటోందని, తమకు వయసు పెంపు అవసరం లేదని డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లలో సింహభాగం మంది మొరపెట్టుకున్నారు. వీలైతే వీఆర్‌ఎస్‌ ప్రకటిస్తే వెళ్లిపోతామని కూడా అధికారులకు స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ఆర్టీసీకి 61 ఏళ్ల వయసు అంశాన్ని వర్తింపచేయకుండా పెండింగులో ఉంచింది. డిసెంబరు 31నుంచి 60 ఏళ్ల ప్రాతిపదికన రిటైర్మెంట్లు మొదలుకానున్నాయి. అయితే పెంపునకు సానుకూలంగా ఉన్నతస్థాయి అధికారులు మరోసారి రిటైర్మెంట్‌ వయసు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలని నిర్ణయించారు.

రెండేళ్ల విరామం తర్వాత ఆర్టీసీలో మళ్లీ ఉద్యోగుల పదవీ విరమణలు మొదలైయ్యాయి. డిసెంబర్‌లో 130 మంది, మార్చి నాటికి మరో 500 మంది రిటైర్‌ కానున్నారు. 2023 మార్చి నాటికి మరో 2 వేల మంది పదవీవిరమణ పొందనున్నారు. జీతాల భారంతో ఇబ్బంది పడుతున్న సంస్థకు ఈ విరమణలు ఊరట నివ్వబోతున్నాయి. రిటైర్మెంట్‌ సమయంలో ఉద్యోగుల జీతాలు గరిష్ట స్థాయిలో ఉంటాయనే చర్చ జరుగుతోంది. కొత్త నియామకాలు కూడా ఉండబోవని ఇప్పటికే ఆర్టీసీ తేల్చి చెప్పినందున భవిష్యత్తులో జీతాల పద్దు చిక్కిపోవటమే కానీ, పెరగడం ఉండదు. ఒకవేళ వేతన సవరణ చేస్తే మాత్రం భారం పడుతోంది.

గత సమ్మె తర్వాత ఆర్టీసీలో వేయికిపైగా బస్సులను తొలగించారు. 1,500 అద్దె బస్సులను కొత్తగా తీసుకున్నారు. వెరసి ఆర్టీసీలో దాదాపు మూడున్నర వేలమంది సిబ్బంది మిగిలిపోయారు. డిసెంబర్‌ నుంచి పదవీ విరమణలు మొదలు కానుండటంతో అదనపు సిబ్బంది సమస్య కూడా తగ్గుతూ రానుంది. 2023 మార్చి నాటికి మొత్తం 2,630 మంది పదవీ విరమణ పొందనుండటం, ఇతర అవసరాలు కొన్ని పెరగనుండటంతో ఈ సమస్య సమసిపోతుందని అధికారులు భావిస్తున్నారు.

Related Articles

Latest Articles