క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ తప్పిందా?

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ కమిటీనే క్రమశిక్షణ తప్పిందా? ఇన్నాళ్లు క్రమశిక్షణ కమిటీపై రాని ఆరోపణల ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

చిన్నారెడ్డి కామెంట్స్‌తో మరో మలుపు తిరిగిన రగడ
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మెదక్ పర్యటన సమాచారం ఇవ్వలేదనే అంశంపై మొదలై.. రేవంత్ కూడా కోవర్టే అనే వరకు విమర్శలను తీసుకెళ్లారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి జగ్గారెడ్డి లేఖ రాయడం కలకలం రేపితే.. అది మీడియాకు ఎలా లీకైందో తెలియదు అని ఆయన చెప్పడంతో ఎపిసోడ్‌ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి చేసిన కామెంట్స్‌ సమస్యను మరో మలుపు తిప్పాయి. జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తా అని చిన్నారెడ్డి చెప్పడంతో.. జగ్గారెడ్డి తన మాటలదాడి కొనసాగిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి సైతం కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ లైన్‌లో కాకుండా.. రేవంత్ లైన్‌లో పని చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.

క్రమశిక్షణ కమిటీ చేసిందేంటి? చేస్తోంది ఏంటి? అని చర్చ
గతంలో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్లుగా చేసిన వారిపై ఆరోపణలు రాలేదా? క్రమశిక్షణ తప్పిన నాయకులను గాడిలో పెట్టాల్సిన క్రమశిక్షణ కమిటీపైనా ప్రస్తుతం ఆరోపణలు వచ్చేశాయి. రేవంత్‌కి చిన్నారెడ్డి అనుకూలమైన వ్యక్తిగా ముద్ర వేయడంతో ప్రారంభమైన పంచాయితీ.. అసలు క్రమశిక్షణ కమిటీ చేయాల్సిందేంటి? చేస్తోంది ఏంటి? అనే చర్చకు శ్రీకారం చుట్టింది. నిజానికి క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగాక.. చర్చకు వచ్చే అంశాలను ప్రకటన రూపం లోనో.. లేకపోతే పార్టీకో నివేదిస్తారు.

అయితే చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ భేటీ తర్వాత మీడియా సమావేశం పెట్టిమరీ.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై కామెంట్స్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. క్రమశిక్షణ కమిటీ కూడా పీసీసీ పరిధిలోనే ఉంటుంది. అందుకే చిన్నారెడ్డితో రేవంతే మాట్లాడించారని జగ్గారెడ్డి ఆరోపించడంతో వివాదం చినికి చినికి గాలివానలా మారింది. జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తామని చిన్నారెడ్డి వ్యాఖ్యానించకుండా ఉంటే సరిపోయేదని పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. గతంలో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌లుగా పనిచేసిన కోదండరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డిలను పార్టీ వర్గాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాయట. వారెవరూ ఇలా వివాదాల్లోకి రాలేదని.. వాళ్లను ఎవరూ వివాదాల్లోకి లాగలేదని చెబుతున్నారట.

సమస్య ఇంకా తీవ్రరూపం దాల్చిందా?
ప్రస్తుత వివాదంలో రెండువైపులా పొరపాట్లు ఉన్నట్టు కాంగ్రెస్‌లో కొందరి అభిప్రాయం. నిజాలు చెబుతున్నానని రేవంత్‌.. చిన్నారెడ్డిలపై జగ్గారెడ్డి కామెంట్స్‌ చేయడం.. ఆపై జగ్గారెడ్డిపై రేవంత్‌ వర్గం విమర్శలు.. సమస్య పరిష్కారం కంటే.. ఇంకా ముదురు పాకాన పడేశాయి. మరి.. తాజా రగడలో ఎవరు క్రమశిక్షణ తప్పారు? గీత దాటిన వారిపై వేటు వేస్తారా? అసలు ఈ వివాదానికి బ్రేకులు పడతాయో లేదో చూడాలి.

Related Articles

Latest Articles