తగ్గేదేలే అంటున్న ‘భీమ్లా నాయక్’.. వారితో వార్ కి సిద్ధం!

ఈ ఏడాది సంక్రాంతికి చిత్ర పరిశ్రమలో గట్టి పోటీ నెలకొంది. స్టార్ హీరోలందరూ తగ్గేదే లే అన్నట్టుగా సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే రిలీజ్ డేట్స్ తో సహా ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘రాధే శ్యామ్’ సంక్రాంతి బరిలో నిలుస్తునట్లు తెలిపారు. అయితే వీరందరికన్నా ముందే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరిలో దిగింది.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డ్ ను క్రియేట్ చేశాయి. పవన్ ‘వకీల్ సాబ్’ తరువాత వస్తున్న చిత్రం అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాలు విడుదల అవ్వడంతో భీమ్లా నాయక్ వెనక్కి తగ్గనుంది అని కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్న సంగతి తెల్సిందే. ఇక ఈ వార్తలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. “భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ అల్టిమేట్ క్లాష్ తో జనవరి 12 న బిగ్ స్క్రీన్ వెలిగిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో భీమ్లా నాయక్ వెనక్కి తగ్గుతోంది అనే రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.

ఏదిఏమైనా ఇది పవన్ అబిమానులకు గుడ్ న్యూసే.. అయినా వారిలో ఆ భయం మాత్రం తగ్గడంలేదనే చెప్పాలి. ఇన్ని భారీ ప్రాజెక్టులు రోజుల గ్యాప్ లోనే విడుదలకు సిద్ధంగా ఉండగా రీమేక్ అయిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వెనక్కి తగ్గని భీమ్లా నాయక్ విజయంలో కూడా తగ్గేదే లే అంటుందో..? లేదో..? చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles