ఒకేసారి నాలుగు చిత్రాలలో నిఖిల్!

దాదాపు 15 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎప్పుడూ నిఖిల్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నది లేదు. 2007లో ‘హ్యాపీడేస్’లో రాజేష్ అనే ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాడిగా నటించి, తొలి విజయాన్ని అందుకున్న దగ్గర నుండి మెట్టు మెట్టు ఎక్కుతూ తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. కరోనా కారణంగా సినిమాల షూటింగ్, అలానే విడుదలలో జాప్యం జరగడంతో ఇప్పుడు ఒకేసారి అతను నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. కరోనాకు ముందు నిఖిల్ ‘కార్తికేయ -2’ సినిమా షూటింగ్ ఆరంభించాడు.

టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. ఇక ఆ తర్వాత గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ’18 పేజెస్’ మూవీకి కమిట్ అయ్యాడు. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీ వాసు, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ కథ, కథనం అందిస్తుండటం విశేషం. ఈ రెండూ కాకుండా, యంగ్ ఎడిటర్ గ్యారీ బి.హెచ్. తొలిసారి దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ స్పై మూవీలోనూ నిఖిల్ నటిస్తున్నాడు. రెడ్ సినిమాస్ బ్యానర్ లో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇదే నెల మొదటివారంలో మొదలైంది.

ఇందులో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిల్ నటిస్తున్న నాలుగో సినిమా షూటింగ్ అక్టోబర్ 25న మొదలైంది. గతంలో తనతో ‘స్వామిరారా, కేశవ’ చిత్రాలను తెరకెక్కించిన సుధీర్ వర్మతో ముచ్చటగా మూడోసారి నిఖిల్ జత కట్టాడు. ఈ సినిమాను సీనియర్ నిర్మాత బి.వి.యస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ఇంకా పేరు పెట్టలేదు. ఇలా ఒకేసారి నాలుగు సినిమాలలో చేస్తుండటం తన కెరీర్ లో మొదటిసారి అని నిఖిల్ ట్వీట్ చేశాడు. నాలుగు సినిమాలు తనకు నలుగురు ఇష్టమైన పిల్లలతో సమానమని, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియడం లేదని, అయితే నాలుగు సినిమాలకూ తన వంతుగా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని నిఖిల్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. మరి ఈ నాలుగు సినిమాలు విజయవంతమై, అతన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళతాయేమో చూద్దాం.

Related Articles

Latest Articles