ఎన్నికల్లో హామీలు ఇవ్వడం.. విజయం సాధించిన తర్వాత వాటిని అమలు చేస్తూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం ఎమ్మెల్యేల పని.. ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ నాయకులు చెప్పేవారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందా? అనే చర్చ మొదలైంది.. దానికి ముఖ్య కారణం హుజురాబాద్ ఉప ఎన్నికలే అంటున్నారు.. తాజాగా, యాదాద్రి భువన గిరి జిల్లా ఆలేరు ప్రజలు.. తమ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు చేసిన విజ్ఞప్తి వైరల్‌గా మారిపోయింది.. గొంగిడి సునీతగారికి ఆలేరు ప్రజల ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది.. ఆలేరు ప్రజలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అభివృద్ధి అంటే ఏమిటో తెలియని పరిస్థితిలోనే ఉన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా అభివృద్ధి అవుతుంది అనుకుంటే.. సీఎం కుటుంబ సభ్యులెవరు ఆలేరు నుండి గెలవలేదు.. కాబట్టి స్వరాష్ట్రంలో కూడా ఆలేరు ప్రజలకు అబివృద్ధి అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు..
అయితే, ఆలేరు అభివృద్ధి జరిగేదెలా..? అనే పరిష్కారాన్ని కూడా చూపారు.. హుజురాబాద్ ప్రస్తుత పరిస్థితులు ఆలేరు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయని.. ఆలేరు అభివృద్ధి మన ఎమ్మెల్యే గొంగిడి సునీతతో మాత్రమే అవుతుందని.. గోంగిడి సునీత గారికి ఆలేరు ప్రజల ఋణం తీర్చుకునే సమయం వచ్చిందని.. నియోకవర్గ అభివృద్ధి కోసం… ఆలేరు ప్రజల ఆకాంక్షను నిజం చేయట కోసం… ఎమ్మెల్యే పదవికి ఆమె రాజీనామా చేయాలని.. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని.. 100 శాతం గొంగిడి సునీతనే గెలిపించుకోవాలి.. గొంగిడి సునీత చేయలేని అభివృద్ధి ఉప ఎన్నికలు చేసి చూపిస్తాయి.. ఆలేరు ప్రజల కంటే గొంగిడి సునీతకు ఎమ్మెల్యే పదవి ఎక్కువ కాదని అనుకుంటున్నాం.. ఇట్లు.. గొంగిడి సునీత రాజీనామా కోసం ఎదురుచూస్తున్న ఆలేరు ఓటరు అంటూ.. ఉన్న మెసేజ్ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో.. ఇతర సోషల్ మీడియా మాద్యమాల్లో దర్శనమిస్తుంది.