విశాఖ రుషికొండపై టీటీడీ నిర్మించిన ఈ ఆలయం ఏడు కొండలవాడి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం.. ఇవన్నీ చూస్తే మరో తిరుమలలా అనిపిస్తుంది. భీమిలి బీచ్ రోడ్డును ఆనుకుని కొండపై 10 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించింది టీటీడీ. ఆలయ నిర్మాణం, ఘాట్ రోడ్డు, ఇతరత్రా సదుపాయాల నిమిత్తం సుమారు 28 కోట్లు నిధులు ఖర్చు చేసింది. ఇప్పుడీ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అచ్చం తిరుమల ఆలయం మాదిరే.. విశాఖలోనూ వేంకటేశ్వరుడి ఆలయాన్ని నిర్మించారు. తిరుమలలో శిల్ప కళాకారులు తయారుచేసిన శ్రీవేంకటేశ్వరస్వామి, ఆంజనేయ స్వామి, శ్రీవారి పాదాలు, భూదేవి ఇతరత్రా విగ్రహాలను విశాఖకు తీసుకువచ్చారు. స్వామి వారి ఆభరణాలనూ పంపింది టీటీడీ.
Read: పెరుగుతున్న డెల్టాప్లస్ ఏవై3 వేరియంట్ కేసులు… అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక…
నిత్యం పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఇద్దరు అర్చకులను నియమించింది. కొండ కింది భాగంలో టిక్కెట్ కౌంటర్లు, ప్రసాద కౌంటర్లు, కల్యాణోత్సవ వేదిక, కార్యాలయాలను అందుబాటులోకి తేనున్నారు. వాస్తవానికి ఆలయం నిర్మాణ పనులు ఏడాది క్రితమే పూర్తి కావాల్సింది. కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఇప్పటికీ పలు కారణాలతో.. ఆలయ ప్రారంభోత్సవం తేదీలు మారుతున్నాయి. ఉత్తరాయణంలో దేవస్థానాన్ని ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. ఆధ్యాత్మిక వాతావరణానికి పెట్టింది పేరైన ఉత్తరాంధ్రలో .. ఇప్పటికే సింహాద్రి అప్పన్న, కనక మహాలక్ష్మి దగ్గర నుంచి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వరకు.. ఎంతో మంది దేవుళ్లు భక్తుల పూజలందుకుంటున్నారు. ఇప్పుడు వెంకన్న వైభవం కూడా తోడైతే ఈ ప్రాంతం మరింత దేదీప్యమానమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.