కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు చేసిన కేటాయింపులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినంత బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించలేదని ఆయన ఆరోపించారు. దేశంలో షెడ్యూల్ క్యాస్ట్‌కు చెందినవారు 28 శాతం ఉంటే కేంద్ర ప్రభుత్వం రూ.20వేల కోట్లు కేటాయించిందని.. అదే దళిత బంధు కోసం ఒక్క తెలంగాణ ప్రభుత్వం రూ.25వేల కోట్లు ఖర్చుపెడుతోందని కడియం శ్రీహరి వివరించారు. బీజేపీకి చేతనైతే దళిత బంధును దేశమంతా అమలు చేయాలని సవాల్ విసిరారు.
Read Also: మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదు : రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో ధనికులు మరింత ధనికులుగా.. పేదవారు మరింత పేదవారుగా మారుతున్నారని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని… ఇప్పటివరకు విభజన చట్టం హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండగగా గుర్తించాలని అడిగితే ఇప్పటివరకు స్పందించలేదని.. బీజేపీ నేతలు చేతగాని సన్నాసులు అని విమర్శించారు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు. అనవసరంగా నోరు పారేసుకుంటే బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు తరిమికొడతారని కడియం శ్రీహరి జోస్యం చెప్పారు.