Site icon NTV Telugu

Sridhar Babu : 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ మా లక్ష్యం

Sridhar Babu

Sridhar Babu

రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా, ఈ విజన్ పాలసీ లక్ష్యాలు, ప్రణాళికలపై ఆయన కీలక వివరాలను వెల్లడించారు.

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. “తెలంగాణను 2037 వరకు 1 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా తక్షణ లక్ష్యం. అలాగే, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా తుది లక్ష్యం. ఈ లక్ష్యాలను సాధించేందుకు వీలుగానే మేము తెలంగాణ రైజింగ్‌ 2047 డాక్యుమెంట్‌ పాలసీని రూపొందిస్తున్నాం,” అని స్పష్టం చేశారు. ఈ ప్రణాళికలో ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఉండేలా చూస్తున్నామని, వాటి మధ్య సమతుల్యతను కొనసాగించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.

ఈ విజన్ డాక్యుమెంట్ నాలుగు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినదని పేర్కొంటూ, దాని రూపకల్పనలో విస్తృత ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. దాదాపు 4 లక్షల మంది ప్రజల సూచనలు, ముఖ్యంగా యువకుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా, అన్ని రంగాల్లోని మేధావులు, నిపుణులతో ఇప్పటివరకు దాదాపు 70 సమావేశాలు ఏర్పాటు చేశామని, అందరి అభిప్రాయాలను తీసుకున్న తరువాతే విజన్ డాక్యుమెంట్‌ను తుది రూపు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

మూడు ట్రిలియన్ ఎకానమీని ఎలా సాధ్యం చేయాలి అనే అంశాలపై ఇప్పటికే తమ బృందం విస్తృత కసరత్తు చేసిందని ఆయన వివరించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌లో అధికారికంగా ఆవిష్కరించనున్నట్టు మంత్రి తెలిపారు. పెట్టుబడులతో పాటు, కీలకమైన సలహాలు ఇవ్వడానికి చాలా మంది పారిశ్రామిక వేత్తలు ఈ గ్లోబల్ సమ్మిట్‌కి వస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు.

శ్రద్ధా దాస్ గ్లామర్ షో..అదిరిపోయే హాట్ పోజులు !

Exit mobile version