తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో మహమ్మారి వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాసరావు న్యాయస్థానికి నివేదిక సమర్పించారు.
ఇదిలా వుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తుందని మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫీవర్ సర్వేలో 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తుందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. కరోనా తీవ్రంగా ఉంది అనేందుకు జ్వర బాధితులే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే.. కిట్లలో అవసరమైన మందులు లేవని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందన్నారు అడ్వకేట్ జనరల్. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని కోర్టు ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని.. ఆదేశించింది. తదుపరి విచారణకు డీహెచ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది